గాడిద ధన్యత (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  యేసు క్రీస్తును సిలువ మరణానికి  అప్పగించటానికి ముందు క్రైస్తవులు పెద్ద ఉత్సవం జరుపుకున్నారు. ఆ రోజున క్రీస్తును గాడిదపైకి ఎక్కించారు. జంతువులలో చులకనగా చూడబడేది గాడిద. అలాంటి  నీచమైన  గాడిదపై  ఎక్కించి  ఆయనను యెరూషలేము పురవీధులలో ఊరేగించారు. గాడిద మురిసిపోయింది. దేవుడిని తనపై ఎక్కించుకుని  తిప్పే ధన్యత లభించింది దానికి.  గాడిదపై ఎక్కి ఊరేగుతున్న యేసును చూడటానికి జనం ఎగబడ్డారు. రోడ్డుపై తివాచీ పరిచారు. పూలు చల్లారు. గంధం చిలకరించారు. సాంబ్రాణి పొగ వేశారు. ఎప్పుడూ మురికి బట్టలు మోసే గాడిద పన్నీటి వాసనకు పులకరించిపోయింది.  ప్రజలకు కూడా దానిపై గౌరవం వేయింతలు పెరిగింది. "ఈ గాడిద ఎంత పుణ్యం చేసుకుందో కదా?" అనుకున్నారు.
      యేసు గాడిద దిగాడు. దేవాలయంలోకి వెళ్ళాడు. ఇక గాడిదను పట్టించుకున్న వారే లేరు. ఎప్పటిలాగే అది మాములు గాడిద అయింది. దేవుడు తనతో ఉన్నంతసేపే దానికి వైభోగం. ఆయన వెళ్ళిపోయాక మామూలే. అందుకే అందరూ ఎల్లవేళలా  దేవుణ్ణి ధరించుకుని ఉండాలని ఈ కథ చెబుతుంది.