*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౩ - 13)

 శార్దూలము :
*ఏ వేదంబు పఠించెలూత, భుజంగం | బే శాస్త్రముల్సూచె దా*
*నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెం | చేమంత్రమూహించె, బో*
*ధావిర్భావ నిధానముల్ చదువుల | య్యా? కావు, మీ పాదసం*
*సేవాసక్తియె కాక జంతుతతికన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
సాలె పురుగు, ఏనుగు, పాము నిన్ను పూజించడానికి ఎటువంటి మంత్రాలు, చదివాయి, శంకరా!  ఎరుకల వాడైన తిన్నడు ఏమి నేర్చుకున్నాడు.  వీళ్ళకు, మంత్రాలు తెలియవు, పూజా పద్ధతులు తెలియవు.  కేవలం, మనస్పూర్తిగా నీమీద పూలు జల్లాలి, నీరు పోయాలి, నీకో గూడు కట్టాలి, అన్నం పెట్టాలి. అంతే. ఇది వారికి తెలియకుండానే, మనసు, మాట, బుద్ధి నీమీద వుంచి చేసారు.  ఈ భుమి మీద వున్న అన్ని జీవులకు, నీ పూజ చేయాలి అనే సంకల్పం మాత్రమే కావాలి. తపన కావాలి.  తప్ప,  మంత్రాలు అవసరము లేదు.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పాపవినాశా! నీవు చేరదీయ తలచుకుంటే, నీ భక్తునికి మాట రాకపోవడం; బుద్ధి, ఆలోచన లేకపోవడం; సమస్య కానే కాదు.  నిన్ను పూజించడానికి, సేవించడానికి, మానవులకు కావలసినది నీ మీద నమ్మకం.  నీవు మా భవబంధాలను తొలగించగలవు అని త్రికరణ శుద్ధి గా నమ్మి ఆచరించడం.  అంతేకానీ, పుస్తక పరిజ్ఞానం తో నిన్ను ఎవరూ చేరుకోలేరు. ఇప్పటి వరకూ ఎవరూ చేరుకోలేదు కూడా. ఆత్మశుద్ధితో, నీపేరు స్మరించి, మొండిగా వుండి నీ సాయుజ్యం పొందిన మార్కండేయుడు, తిన్నడు ఇందుకు సాక్షీ భూతులుగా నిలుస్తారు, కరుణాపాంగా, కరుణాంతరంగా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss