శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౯ - 19)

 శార్దూలము:
*నీకున్, మాంసమువాంఛయేని కరవా! | నీచేత లేడుండగా*
*జొకైనట్టి కుఠారముండగ ననల | జ్యోతుండ నీరుండగా*
*పాకంబొప్పఘటించి చేతిపునుకన్ | భక్షింప కాబోయచే*
*చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
శివా ఏమిటయ్యా ఇది, వింత కాకపోతే, నీకు మాంసం తినాలని కోరిక గలిగితే, వంట చేసుకోడానికి అవసరమైన, మాసం ఇచ్చే లేడి, లేడిని చంపడానికి పదునైన గొడ్డలి, వుడకడానికి అవసరమైన నిప్పు, నీరు, ఇవన్నీ వుంచడానికి పుర్రె పాత్ర  అన్నీ నీ చేతులోనే వున్నాయి కదా పరమేష్ఠీ!  ఇంత సంబారం నీ దగ్గర వుంచుకుని ఏమీ చేతకానట్టు, బోయడైన తిన్నడు ఇచ్చిన ఎంగిలి మాంసము తింటావు, ఏమిటయ్యా ఇది, మాకు అర్థం కాని వింతే కదా   .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*గౌరీ వల్లభా! మాతో ఇంతలా ఆడుకోవాలా సామీ! మాకువున్న బుద్ధి మాంద్యాన్ని మాకు పరిచయం చేయడానికి. ఏమి తక్కువ నీకు, ఎంగిలి కూడు తినడానికి.  లేదా, నీ ఈ చర్య ద్వారా నీ దృష్టిలో అందరూ సమానమే అని చూపడం నీ లక్ష్యమా! ఈ నా ఊహ నిజమేమో, కదా శూలపాణీ!  నీ సృష్టిలో ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనేదే లేదుకదా.  అయినా , నీకు ప్రతీ సారీ, ఎంగిలి కూడే పాపం. ఒకప్పుడు శబరి, మరొకప్పుడు వకుళమాత, ఇంకొకసారి తిన్నడు.  అయితే, నీ మాయలో పడి కొట్టుకు పోతున్న మాకు దిక్కు నీవేగా దిక్పతీ!  మమ్మల్ని కాపాడి, నీ ఒడికి చేర్చుకో, వాయులింగా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss