తాతయ్య కథలు-27. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 అక్కయ్య! ఇక నేను వెళ్లి వస్తా అని, తమ్ముడు అనగానే-బావగారు వచ్చే వరకు ఉండరాదు రా అన్నది అక్క.
లేదు అక్కయ్య! నేను తొందరగా వెళ్ళాలి. రేపు మళ్ళీ  ఆఫీసుకు వెళ్లాల్సి ఉంది. లీవులు కూడా లేవు. అంటూ బైక్ ఎక్కాడు.
అమ్మా! అన్న కొడుకు తో... ఏమిటి అన్నది అన్నపూర్ణ. వెళ్తా అనాలి కాని, వెళ్లి వస్తా అంటే... మళ్లీ ఇప్పుడు వస్తాడా మామయ్య.
అది కాదు రా నాన్న... వెళ్లి వస్తా అనడం శుభంగా మాట్లాడడంలాంటిది. వెళ్తా అంటే... అశుభం గా భావించి చి మనవాళ్లు అలా అంటారు. అదే ఆనవాయితీగా వస్తుంది.
ఇంతెందుకు రా. గుడిలో కూడా సింహద్వారం పైన పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని రాసి ఉంటుంది. అంటే మళ్లీ మీకు దైవ దర్శనం కావాలి అన్న మాటే గా...
అయినా బైక్ మీద వెళ్తాను అనో, బస్సు మీద వెళ్తాను అనో, ట్రైన్ మీద వెళ్తాను అనో అనరు కదరా. అనీ అమ్మ అనే సరికి అలాగా. అని కొడుకు అన్నాడు.