నా బంగారు బాల్యాన్ని
కమ్మని కథలతో..
రసరంజిత పద్యాలతో
ప్రేరణా రెక్కలు తొడిగిన నాన్న
లెక్కల చిక్కుముడులను
అనుభవాలతో రంగరించి
నాభవితనే తన కంటి వెలుగుగా
ఆడపిల్ల చదువు జగతికే
నిండు వెన్నెలగా
తీర్చిదిద్దిన నాన్నే నా తొలి గురువు
ఆటల పోటీలు ఒంటికి గాయాలనీ
వద్దని చెప్పే అమ్మను కాదని
దూసుకు పోయే చొరవ
పోరాటపటిమ జీవితానికి
అవసరమన్నాడు నాన్న..
భవిష్యత్తు ఊహల ఊడలకు
పాదుకనిస్తూ ధైర్యమానువలెనుంటూ
తన వీపు వాహనమెక్కించి
ఈతవిద్యలు నేర్పిన మా నాన్న..
కుటుంబ రథ చక్రాన్ని
తన స్వేదజలంతో లాగుతూ
అహర్నిశలు పొలం పనులలో
మునిగి తేలే మౌనజీవి..
ధర్మ సాధన కర్మజీవి నాన్న..
అగ్రజ స్థానంలో ఉన్నత
చదువులకు స్వస్థి పలికి
బోధక ఉద్యోగాన్ని త్యాగంతో
సోదర భవితను తీర్చిదిద్ది
ఆదర్శమూర్తి అయిన నాన్నే
నా తొలి గురువు..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి