బాలగేయం:- -- సత్యవాణి-8639660566

 గొర్రె పోతు ఒకటుండెను
గర్వంతో బలిసుండెను
వడి తిరిగిన కొమ్ములతో
వదరు బోతు అయి వుండెను
ఎదురొచ్చిన దెవరైనా
ఎగిరి కొమ్ములతో కుమ్మును
భయపడి ఎవ్వరు దానికి
బదులు చెప్పకుండిరంత
బక్క కుక్క ఎదురు పడగ
బలము చూపి కుమ్మబోవ
బక్క కుక్క చెప్పెనపుడు
బాగ బుధ్ధి వచ్చునటుల
బక్కదాన్ని నను కుమ్మగ
పరాక్రము కాబోదు
ఎదురు గున్న కొండ చూడు
ఎగతాళిగ నవ్వుచుండె
పందెం తనతో కాయని
పదే పదే పిలుచు చుండె
పోయి దాన్ని కుమ్మి రమ్ము
పొగరు కొండ దణచి రమ్ము
కుక్కమాట విని పొటేలు
గుద్దెను కొండను  తలతో
కొమ్ము లూడి పడిపోగా
కూలబడెను పొట్టేలు
తెలిసివచ్చె  తప్పేమిటొ
చావు దప్పి బ్రతికి పోయె
తగ్గి పోయె పొగరంతయు
బుధ్ధి గలిగి పదిగురితో
స్నేహంగా మెలుగు చుండె