ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999
ఎనుకట
ఆయిటి పూనక ముందే
సీమలు తమ తిండిని ఏరుకచ్చుకొని కూడవెట్టుకున్నట్టు
కొందరు పిడుకలు జేసుకోని ఎండబెట్టి అటుకు మీద దాసుకునేటోల్లు.
ఇంకొందరైతే... 
పచ్చి తుమ్మ కట్టెలో,
కానుగ కట్టెలో, 
మోతుకు కట్టెలో,పబ్బకట్టెలో,
ఏదో సిన్న సిన్న కట్టె పుల్లలో
మూరెడు మూరెడు 
గొడ్డలితో నరికి,ఎండబెట్టి,
ఇరుగ ఎండినంక
అటుకు మీద పెట్టుకునేటోల్లు.
సగం సగం ఎండిన కట్టెలను
దాసి పెడితే కొద్ది దినాలకు పురుగు పడుతయుల్లా!

ఆన కాలమంటే..ఆన కాలమే! 
ఆనలు ఇసిరిసిరి కొట్టేటివి.
ఎవుసం పనులే గాదు, 
ఏ పని సేయకుంట
ఒగోసారి ఆరం,పది దినాల దాకా ముసురు వెట్టేది.
మా మూలాగు,నక్కాగు,
ఒర్రెలు, నిండుగ పారేటివి.
సెరువులు,కుంటలు,
బాయిలు నిండేటివి.  
ఇండ్లల్ల సాద బాయిలల్లకు గుడ నీళ్ళు బగ్గ అచ్చేటివి. 
తొవ్వంతా 
బురుద బురుద అయేటిది. 
లబ్బరి సప్పులేసుకుంటే 
జారి పడేటోల్లం.
ఆన వడ్డప్పుడు  తడువకుంట
సెత్తిరి వట్టుకొనో, లేక పోతే
అరకు సంచో,గోనె సంచో
ఏసుకునే టోల్లం.
కొందరైతే... 
గొంగడిని నెత్తి మీద కప్పుకునేటోల్లు.
ఆన వడ్డప్పుడు
సెనిగలో,మక్కలో,అటుకులో,
ఏంచుకొని బుక్కేటోల్లం.

ఆన కాలంల గుడ
శానా మంది బడి పోరగాల్లం
ఒక్క నాగ వోకుంట 
అన్మశ్పట బడికి పోయెట్లోల్లం.
అన్మశ్పట బడికి పోవల్నంటే
మా నక్కాగు దాటాలే. నక్కాగు జోరు మీదఅచ్చేటిది.
నడుసుకుంట పోవుడు కట్టం.
నక్కాగుల మోకాళ్ళ మందం నీళ్ళత్తే ఒకళ్ళనొకళ్ళం  సేతులు వట్టుకొని అడుగుల అడుగేసుకుంట మెల్లగ నడుసుకుంట పోయేటోల్లం.  
నడుముల మంటి నీళ్ళత్తె
మా లాగులు తడిసేటివి. 
ఇగ బడికి పోవుడు బందే.
అయితే..
పక్కపొంటి పారే మూలాగు అయితే మెల్లగ పారేది.
గీ నక్కాగు,  గా మూలాగు 
ఒక్క దగ్గెర కలిసిన జాగల
మత్తడి గట్టిండ్రు.
కింద పోటువల కనిపిచ్చేదే మత్తడి.
ఆ మత్తడి కాలువ నుంచి
ఎములాడ రాజేశుని గుడి సెర్లకు నీళ్ళు పోతయి. 
ఇగ మత్తడి నుంచి 
ఆగు పోంటి పోయే నీళ్ళు 
ఎములాడ ఆగుల కలుత్తయి.
ఆ మత్తడి 
ఏ ఊరిదనుకున్నరుల్లా?
మా మల్లారందే. .
ఔ మల్ల!