ఔ మల్ల!:-- బాలవర్దిరాజు మల్లారం-871 297 1999
నేను 
ఒకటి నుంచి నాలుగో తరగద్దాక 
మా మల్లారంలనె సదివిన.
మరి  నా సిన్నప్పుడు
మా ఊల్లె
నాలుగో తరగతి దాకనే ఉండేదుల్లా. 
అన్మశ్పటల పదోది దాకా  ఉంది 
గందుకని  
అన్మశ్పటకు 
మల్లారం లోని 
బడి పోర గాండ్లం 
రోజూ నడుసుకుంట వోయి
సదువుకునేటోల్లం.
నేను
ఐదు నుంచి పది దాకా
అన్మశ్పటలనే సదువుకున్న.

ఒక్క మా ఊరోల్లే కాదుల్లా!
అన్మశ్పట సుట్టుపక్కలున్న
బొల్లారం,లింగం పల్లి, మురుసు గడ్డ, ఎనుగంటి నుంచి గుడ అన్మశ్పట బడికి అచ్చి సదువుకునేటోల్లు.

నేను పదోదిల ఉండంగ 
సెంద్ర మోలి సారు
తెలుగు సెప్పేటోడు.
మా క్లాస్ ల పెబ్బె 
ఎన్.లచ్చిరెడ్డి ఉండేటోడు.

వొగ రోజు  
సెంద్ర మోలి సారు 
తెలుగు సెపుతున్నప్పుడు
"" రావచ్చా సార్? " అని
బయట నుంచి ఇనిపిచ్చింది.
అందరం తలుపు దిక్కు సూసినం. సారు గుడ పాఠం ఆపి సూసిండు.
తలుపుల దగ్గర బి.ప్రబాకర్, ఎంకటేస్వర్లు నిలబడి ఉన్నరు. ఆల్లను జూసి
" లేట్ ఎందుకయింది? " అని
సారు అడిగిండు.
" మాది ఎనుగంటి సార్!
నడుసుకుంట అచ్చేటల్లకు
లేట్ అయింది ! " అని బయపడుకుంట మెల్లగ 
బి. ప్రబాకర్ అన్నడు.
"  మీది ఏ గంటి అయినా ఈ
బడి గంట ఏగక ముందు రావాలే" అని అనేసరికి 
క్లాస్ ల ఉన్నోల్లం 
అందరం పుసుక్కున నవ్వినం.
పాపం! బి.ప్రబాకర్ కు, ఎంకటేస్వర్లకు కండ్లల్లకు నీళ్ళచ్చినయ్.
" సరే! లోపలికి రాండ్రి. ఇంకోసారి లేట్ గా రావద్దు"
అని సార్ అన్నంక .ప్రబాకర్, ఎంకటేస్వర్లు లోపలికి అచ్చి కూసున్నరు.

సార్లు ఏమన్న పని సెపితే
సంబర పడుకుంట,
ఉరుక్కుంట సేసేటోల్లం.
వొక దినం ఏమయిందంటే...
సెంద్ర మోలి సారు  తెలుగు పాఠం సెపుతు
 " ఎవరన్న వాగులకు పోయి
మంచి నీళ్ళు తీసుక రాండ్రా"
అని అనే సరికి
ఎస్. నర్సిమ్మ రెడ్డి లేచి
 " నేను తెత్త సార్!" అని పోయిండు.ఎస్. నర్సిమ్మ రెడ్డి 
ఆగులకు వోయి సెలిమ తోడి
గా సెలిమల నీళ్ళను 
సిన్న కూజల తెచ్చి,
" సార్!  నీళ్ళు ఎక్కడ వెట్టాలే" అని అన్నడు.
పాఠం సెపుతున్న సారు పాఠం ఆపి ఎంటనే 
" నా నెత్తి మీద వెట్టు"
అని అనే సరికి అందరం 
పక్క పక్క నవ్వినం.
పాపం! ఎస్. నర్సిమ్మ రెడ్డి  మొకం సిన్నవోయింది.

బల్లె జరిగిన గిసొంటి ముచ్చట్లు బగ్గనే ఉన్నయి గని గిప్పటికి గింతేనుల్లా!
ఏవైనా శానా ముచ్చట్లు సెపితే 
మనసున వట్టది.
అవ్ గని  అన్మశ్పట గురించి ఇంకో ముచ్చట సెప్పడం 
ఆది మరిసిన. 
మన  మహా కవి
డా. సినారాయణ రెడ్డి పుట్టింది  గీ అన్మశ్పటలనే.
ఔ మల్ల!