శానా యేండ్ల కిందటి ముచ్చట
గప్పట్ల
నల్లులతో బాద పడనోల్లు లేరు.
నులక మంచాలల్ల, నవారు మంచాలల్ల, మంచాల మీద ఏసుకునే బొంతలల్ల,
మెత్తలల్ల, సెద్దర్లల్ల,
బళ్ళల సందులల్ల,కట్టె కుర్సీల సందులల్ల,గోడల పొక్కలల్ల,
బస్సు సీట్ల సందులల్ల,
సీన్మ టాకీస్ కుర్సీలల్ల
నల్లులు బగ్గుండేటివి.
అవి కుట్టే దాకా తెల్వక పోవు.
దోమల లెక్కనే
పసులకు పిడుదులు,
మనుషులకు నల్లులు
నెత్తురు తాగేటివి.
రాతిరి మంచాల నిదుర పోంగనే మెల్లగ కుట్టి నెత్తురును
కడుపు పగిలేటట్టు తాగేటివి.
ఒగ దిక్కు దోమలతో బాద,
ఇంకో దిక్కు నల్లులతో బాద.
అస్సలు నిదుర వట్టేది గాదు.
పొద్దుగాల లేసి
మంచం కాళ్ళ కట్ట కాడ
నులకను/నవారునుసల్లు ఇడిసి, ఆకిట్ల ఏసి, ఎండల బగ్గ సేపుంచి,
ఉడుకుడుకు నీళ్ళు వోసి
గుతుపతోని నులకను ఇయ్యర మయ్యర కొడితే
నల్లులు కింద రాలేటివి.
ఆటిని సంపితే గబ్బు ఆసనచ్చేది.
దోమలు పోవుటానికి
మంచం కింద కుంపటి
పెట్టుకునేటోల్లం. గానీ..
గా నల్లులు సచ్చుటానికి
ఏ మందు లేదప్పుడు.
ముప్పై,నలబై యేండ్ల కింద
ఉన్న నల్లులు గిప్పుడు లేనే లేవుల్లా!
మన దగ్గెర లేవు గని
గిప్పటికి గ్గుడ అమెరికాలో
నల్లులు బగ్గున్నయట.
మనకు దోమల బాద యెట్లనో
అమెరికొల్లకు నల్లులతో
శానా బాదటనుల్లా!
గా నల్లులతో ఆళ్ళకు
అశ పడుత లేదట.
గా నల్లుల మీద
వొక సాత్రం గుడ ఉందుల్లా!
మన తోని మంచిగనే ఉండుకుంట ఇక్కడి ముచ్చట్లు అక్కడ జెప్పేటోన్ని,
ఏం తెలియనట్టే ఉండుకుంట
మన ముడ్డి కిందికే నీళ్ళు తెచ్చేటోన్ని
' నల్లి కుట్లోడు ' అని అంటరు.
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 297 1999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి