ఔ మల్ల!:--బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

 నేను సిన్నగున్నప్పుడు
మా మల్లారంల 
జంగం రాజవ్వకు 
పోంగ పోంగ దక్కిన పెద్ద కొడుకును
బగ్గ లాడు జేసి
ఒక్క దెబ్బ కొట్టకుంట,
ఒక్క మాట తిట్టకుంట
బంగారమోలే సూసుకునేది.
ఇంట్ల పనున్నప్పుడు  
కొడుకు పనికి అడ్డమొత్తే.. 
"నీకు పనుకాయ్ ఇత్త"అని,
"రాతిరి సూడవోదాం 
పండుకో"అని బుదరకిచ్చి
పండుకోబెట్టి తన పని తను జేసుకునేది.
గా పిలగాడు
గంటో,రెండు గంటలో పండుకొని లేసేటల్లకు
సర్వ పిండో,రొట్టెలో సేసిచ్చేది.
లేకపోతే..
మంగులముల
సెనిగెలు ఏంచి పుట్నాలో,
మక్కిత్తులు ఏంచి 
ప్యాలాలు జేసిచ్చుడో,
అటుకులో మర్ల వోసి పెట్టేది.
గంతే కాదుల్లా!
కుండల  
సోడో, అర సోడో మక్కలన్నా, అనుములన్నా, పెసల్లన్నా, బబ్బెర్లన్నా పోసి 
కట్టెల పొయి మీద  
మంట వెట్టి ఉడుకవెట్టేది.
ఉడికినంక గవ్వే
గుడాల్ అయేటివి.
ఇంక కుండల మిగిలున్న
నీళ్ళను అంచి, గుడాలను
ఏరే బాసండ్ల వోసి,
పొయి మీద కంచుడు వెట్టి
గా కంచుట్ల పల్లి నూనె వోసి, 
నూనె బగ్గ కాగినంక, 
దాంట్ల  
ముత్తెమన్ని ఎల్లి పాయలన్నా,  కోసిన ఉల్లి గడ్డలన్నా ఏసి,
పచ్చి మిరపకాయలు,
కల్యమాకు గుడ  కలిపి 
దోర దోరగా ఏగి నంక
గుడాలు గుడ ఏసి 
మర్ల వోసేది. 
ఉడుకుడుకు గుడాలను
కొన్ని సిన్న గిన్నెల పోసిచ్చేది.
గట్ల గా పిల గానికి
తీరొక్కటి సేసి పెట్టేది.
గప్పుడు గా పిలగాడు
సంబుర పడుకుంట
బుక్కేటోడు.
గట్ల మర్ల వోసిన గుడాల్ బుక్కితే కమ్మగుంటయుల్లా!
మీలో ఎవలన్నా, ఎప్పుడన్నా 
గసొంటి గుడాలను బుక్కినారుల్లా?
ఔ గని   
గియన్ని ముచ్చట్లు 
మంచిగనే సెప్పిన గని
గా జంగం రాజవ్వ కొడుకు పేరే సెప్పనే లేదు గదుల్లా!
గా పిలగాడు ఎవడో 
మీ అందరికీ తెలిసినోడే! 
మీ మనుసుల అనుకున్నది
నువద్దిగనేనుల్లా. 
ఔ మల్ల!