మంచిని గ్రహించు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  "సార్,వినీత్ మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడూ చెడ్డ మాటలు ఉపయోగిస్తుంటాడు,కానీ నాకు తెలియని మంచి విషయాలు చెబుతుంటాడు,లెఖలు చేయడంలో నాకు హెల్ప్ చేస్తుంటాడు,మరి వాడి చెడు మాటల్ని ఎలా మాన్పించాలి సార్" అడిగాడు వాసు విద్యాపతి మాస్టర్ని.
       "చూడు వాసు,కొన్ని అలవాట్లు,కొన్ని రకాల మాటలు అతను పెరిగిన సంఘ వాతావరణం,కుటుంబంలో పెద్దలు మాట్లాడే మాటలు  అలవడి పెద్దైనా ఆ అలవాట్లు పోవు,అటువంటి వారికి మెల్లగా చెప్పి ఆ అలవాట్లు మాన్పించాలి.మనకు ప్రకృతి కూడా ఈ విషయం చెబుతుంది.ఆపిల్ పండ్లే తీసుకో,ఆపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది,కానీ దాని విత్తనాల్లో సైనెడ్ అనే విషం కొద్ది మతాదులో ఉంటుంది.అందుకే ఆ విత్తనాలు పారవేసి పండు మాత్రమే తింటాం,రోజా పువ్వులే చూడు,రోజా పూలు ఎంతో అందంగా మంచి వాసనతో ఉంటాయి మరి వాటి కొమ్మలకు ముళ్ళు ఉంటాయి కదా! అయినా రోజా పువ్వులంటే ఇష్ట పడని వాళ్ళెవ్వరు?
ప్రతి మనిషిలో కొన్ని జీర్ణించుక పోయిన చిన్న చెడ్డ అలవాట్ల వలన వారికి కొంత చెడ్డ పేరు ఉండవచ్చు,అందుకే వారి లోని మంచిని మాత్రమే గ్రహించి,చెడు తొలగించడానికి ప్రయత్నించాలి,నీవు కూడా వినీత్ లో చదువు మీద ఉన్న అవగాహన,సహాయం చేసే తత్వం గ్రహించు,వీలైనప్పుడల్లా మెల్లగా చెడ్డమాటలు ఉపయోగించడం మానమనిచెప్పు,నేను కూడా అతనికి తగిన విధంగా చెబుతాను,స్తహాగా మంచి బుద్ది కలవాడు కనుక మాట వింటాడు.ప్రతి ఒక్కరిలో మంచిని గ్రహించాలి,ఏ కాస్త చెడున్నా  అది తీసి వేయడానికి ప్రయత్నించాలి" చెప్పారు విద్యాపతి మాస్టర్.
         అర్థమైంది సార్ మంచిని గ్రహించాలి,వారిలో ఉన్న మంచికి గౌరవం ఇవ్వాలి"చెప్పాడు వాసు.
        అప్పుడే రోడ్డులో రోజా పూలు అమ్ముతున్న ఆవిడ బుట్ట పైన రోజా పూలు ఎంతో అందంగా కనబడ్డాయి!