బాల సాహిత్యం-ఒక పరిశీలన:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  పెద్దలు వ్రాసిన బాలసాహిత్యం పిల్లలకు చేరుతోందా? ఇంట్లో పెద్దలు పిల్లలకు ఆసక్తికరమైన,నీతిదాయకమైన మంచి కథలు చెబుతున్నారా?
     ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం -చిన్నారుల్లో కథలు చదవాలనే జిజ్ఞాసను పెంచడం,వారిలో ఉన్న సృజనాత్మకత బయటకు తీయడం వంటి పనులు చేస్తేనే పిల్లలకు కథల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఆ ఆసక్తిని పెంచడానికి పెద్దలు ఉపాధ్యాయులు ఏం చేయాలి?
      మొదట పిల్లలకు మంచి రంగుల బొమ్మలతో ఉన్న కథలు చూపించి వారికి కథల మీద ఆసక్తి కలిగించాలి.వారు కథలు చదవకపోతే పెద్దలే కథలు చదివి ఆసక్తి కలిగే విధంగా చెప్పాలి.
       పత్రికల్లో వచ్చే ఛాయాచిత్రాన్నో,కథకు సంబంధించిన బొమ్మనో రాయగలిగిన పిల్లలకు(కొంచెం పెద్ద పిల్లలకు) చూపించి వారిని సొంతంగా కథ వ్రాయమని చెబితే వారిలోని సృజనాత్మకత బయట పడుతుంది.
      విదేశాల్లో పిల్లలకు రాత్రి పడుకునే ముందు bed time stories అనే చిన్న మంచి కథలు చెప్పి నిద్రపుచ్చుతుంటారు!
         మనలో కూడా ముఖ్యంగా పాతతరం వారిలో నాన్నమో,అమ్మమ్మో పిల్లలకు కమ్మని కథలు చెప్పేవారు.ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కదా! ఉద్యోగ రీత్యా నాన్నమ్మలను,అమ్మమ్మలను తాతయ్యలను ఊర్లో ఉంచి పిల్లతో సహా ఏనగరానికో,విదేశాలకో వెళ్ళిపోతే ఇక పిల్లలకు కథలు చెప్పే నాన్నమ్మ,తాతయ్యలు ఎక్కడ?
        పిల్లలకు డబ్బు కుప్పలుగా సంపాదించి ఇవ్వడం కాదు,వారికి జ్ఞానం,నీతి కలిగించే కథలు,సృజన కలిగించే విషయాలు చెప్తే వాళ్ళే మీరు ఊహించనంత సంపద సంపాదించగలుగుతారు.ఈ విషయం మీద ఆలోచించండి.
         మనం అనేక దిన పత్రికలు,వార,మాస పత్రికలు చదివి తూకానికి అమ్ముతుంటాము,కాస్త ఓపికగా వాటిలోని బాలల కథలను కత్తిరించి మిగిలి పోయిన పాత డైరీలోనో,నోట్బుక్ లోనో అంటించి ఇస్తే పిల్లలకు మంచి కథల పుస్తకం అందించినవారం అవుతాము.
వారిని కూడా ఆవిధంగా కథలు కత్తిరించి అంటించమని చెబితే,వారు తయారు చేసుకున్న ఆ పుస్తకం మీద వారికి ఆసక్తి పెరిగి చదువుకుంటారు కదా!
       విదేశాల్లో వారానికి ఒకసారి కొందరు ఒకచోట కలసికథలు చెప్పుకుంటారు.వారు దానిని 'story telling day'అని పిలుచుకుంటారు.ఇప్పుడిప్పుడే బెంగుళూరు,హైదరాబాద్ లలో ఇటువంటి 'కథలు చెప్పే రోజు'ల్ని జరుపుకుంటున్నారు.ఇది ఎంతో శుభ పరిణామం.
          గుడి సందర్శించినా, ప్రదర్శన శాల కు వెళ్ళినా అక్కడి శిల్ప సంపదకు,ప్రదర్శన శాలలో వస్తువులను గురించిన విశేషాలు,కథలు పిల్లలకు చెప్పాలి.
          కథల్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సూత్రాలు,మూఢనమ్మకాలను తొలగించే విశేషాలు తెలియచెప్పాలి.
      నిజానికి సృజనకు అంతులేదు---బాలసాహిత్య రచయితలు,మేధావులు తగిన విధంగా ఆలోచించి బాల సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలి.