చింతా దీక్షితులు బాల సాహిత్యం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 చింతా దీక్షితులు 1891 తూర్పు గోదావరి జిల్లా దంగేడు గ్రామంలో జన్మించారు.వీరు బి.ఎ.ఎల్.టి చదివి బ్రటిష్ ప్రభుత్వవిద్యా శాఖలో పనిచేసారు.
1912లో 'చిత్ర రేఖ' అనే అపరాధ పరిశోధన నవల రచించారు! గేయ కవిత్వం పై మక్కువ పెంచుకుని 'హరిణ దంపతులు' 'కవికన్య' అనే గేయ కవితా పుస్తకాలను ప్రచురించారు.కొన్ని నాటకాలు కూడా రచించారు.అప్పటిలో వ్వవహారిక భాషలో వ్రాసిన 'అనుమానం మనిషి'నాటకం బాగా ప్రసిద్ధి పొందింది.
        ఈయన బాల సాహిత్యంలో విశేష కృషి చేశారు.పిల్లలు సులభంగా పాడుకో కలిగిన  సరళమైన భాషలో 'లక్క పిడతలు'అనే గేయ సంపుటి ప్రచురించారు.ఇతర భాషల కథలు,వ్యాసాలను తెలుగులోకి అనువదించారు.
        రష్యాకు చెందిన'సెవలోద్ మిఖిలోవిచ్ గార్డిన్'వ్రాసిన కథను 'ఎర్రజెండా'అనే పేరుతో అనువదించారు. 1953లో 'మినుమా నిసాని' వ్రాసిన 'హిందుస్థాన్ హమారా' వ్యాసాన్ని 'మన ఇండియా'అని అనువదించారు.
       ఈయన రచించిన'బంగారు పిలక' బాలల పెద్ద కథ పిల్లలను,పెద్దలను అసాంతం చదివిస్తుంది.కథలో సంధర్భానుసారంగా బ్రాహ్మణుడు,నక్క,కాకి సంభాషణలు గేయ రూపంలో రచించారు.
      సాహిత్యానికి విశేష కృషి చేసిన'భారతి' మాసపత్రిక 'బాలానందం' శీర్షికలో,తరువాత 'ఆంధ్ర పత్రిక' లోఆధ్బుతమయిన బాల గేయాలు వ్రాశారు.
      1947 లో ప్రచురింప బడిన 'లక్క పిడతలు' గేయ సంపుటికి 1949 లో ప్రభుత్వం 500 రూపాయల మొదటి బహుమతినిచ్చి సత్కరించింది.
ప్రసిద్ద రచయిత చలం,దీక్షితులుగారి  సాహిత్యాన్ని ఎంతో కొనియాడారు.
         1991లో ఈయన శతజయంతి ఉత్సవం బడ్డిగ సుబ్బరాయన్ అధ్యక్షతన జరిగింది.ఈయన కుమారుడు చింతా మల్లిఖార్జున మూర్తి సౌజన్యంతో కొన్ని రచనలు పుస్తక రూపంలో వచ్చాయి.
     'చింతా దీక్షితులు-బాలసాహిత్యం'పుస్తకం(207/-) విశాలాంధ్ర పుస్తక కేంద్రాలలో దొరుకుతోంది.ఇవే కాకుండా'బాలానందం' అనే పేరుతో కొన్ని అందమైన కథలు వ్రాశారు.
      ఆయన వ్రాసిన కొన్ని బాల గేయాలు చూద్దాం,వీటిలో ప్రాసే కాదు భాషా నైపుణ్యం కూడా చూడవచ్చు.ఇవి ఆంధ్ర సచిత్ర వార పత్రిక 1947లో ప్రచురితమయ్యాయి.(కొన్ని పదాలకు అర్థాలు దొరకడం లేదు)
          చింతకాయ బొంతకాయ
           చిగురు మామిడి కాయ
            కొల్లేటి వంకాయ
            కొమ్మ నిమ్మ పండు
              వాలికిలి గుంటలో(వాలికి=అంగుటి)
             వేలిగలు వెయ్యగా
             ఒక్కటే రాలగా
            ఒంటి పువ్వు పుయ్యగా
            తాటాకు చప్పుడే(తాటాకు పందిరి)
            కోట వెలుగు.
            **********
         అట మాణిక్యమే పాట మాణిక్యం
       నట్టింట అమ్మాయి రత్న మాణిక్యం
        అమ్మాయి మామలు ఎటువంటివారు
        చెవి చెవికి బారడేసి కమలాల వారు
        అడ్డ పాగాల వారు అంగీల వారు 
       వేడుక గుర్రానెక్కి వేటాడువారు
        ఆడంగ ముద్దు పాడంగ ముద్దు
      నట్టింట అమ్మాయి నవ్వంగ ముద్దు.
             *********
       చందమామ చీరే కట్టి
       సన్నా బియ్యం ఒళ్ళోపోసి
       అమ్మా నేను చిన్నదాన్ని
      అల్లుడు వస్తే అంపాబోకు
      మామ వస్తే మళ్ళీ రమ్మను
      చద్దీ కట్టా గుడ్డాలేదు
       సాగనంపా పొద్దులేదు
       ఇరుగూ పొరుగు అక్కల్లారా
        ఒకటే తుమ్ము ఆ....చ్.
(అప్పటిలో బాల్య వివాహాలు సాధారణం.ఆ పరిస్థితుల్లో ఆ చిన్నారి కాపురానికి పోనని సొగసుగా చెప్పిన గేయం.)
        ********************
    ఒదినా ఒదినా ఒల్లంకి పిట్ట
     గదిలో పెట్టి గంజి నీళ్ళు పొయ్యి
    నీ కొడుకు పుట్ట నా పేరెట్టు
    మా అన్న కొట్ట నీవు పారిపోను
    నే బతిమాల,నీవు యేడవ నేనవ్వ!
            ***************
      కాముడోయి భీముడోయి
     కంది పప్పు దేముడోయి
      చెన్న పట్నం చెరుకు ముక్కా
       నీకో ముక్కా నాకో ముక్కా
         ****************
ఈ విధంగా పిల్లలకు బోలెడు గేయాలు,కథలు ఆయన రచించారు.
(' తెలుగు పసిడి' గ్రంథం లోని బుడ్డిగ సుబ్బరాయన్ వ్యాసం నుండి....
   చింతా దీక్షితులు అప్పటిలో 'బాల వాజ్జ్మయ బ్రహ్మ' గా కీర్తి పొందారు.బాల సాహిత్యానికి ఇంత కృషి చేసిన దీక్షితులు గారు 1960 ఆగస్టు 25 న కీర్తి శేషులయ్యారు.
         ***************

కామెంట్‌లు