మంచి చేసి చూడు:- కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

    కమల ఎంతో మంచి పిల్ల.ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చెయ్యడానికి కమల ముందుంటుంది. ఎక్కడైనా హరికథా కార్యక్రమం ఉన్నా, ఏదేవాలయంలో అయినా ప్రవచన కార్యక్రమం ఉన్నా కమల తప్పక వెళ్ళేది, వెళ్ళడమే కాదు వాళ్ళు చెప్పే మంచి మాటల్ని గ్రహించేది,ఆచరణలో పెట్టేది!
        చదువులో,ఆటల్లో కూడా కమల తన ప్రతిభ చూపించేది.అందుకే కమల ఇంట్లో వాళ్ళకే కాదు, ఊర్లో వాళ్ళకి కూడా ఎంతో అభిమాన పాత్రురాలైంది!మంచి తనం, ప్రేమ కురిపించే తత్వం ఉంటే ఖఠిన హృదయాలు కూడా మారుతాయి కదా!
           ఒకరోజు కమల పండ్లు తేవడానికి ఒక తోటకు వెళుతోంది.మార్గ మధ్యంలో ఒక ముసలమ్మ సొమ్మసిల్లి పడి పోయిఉంది చుట్టు పక్కల ఎవరూ లేరు. ముసలమ్మ పరిస్థితి గమనించి కమల పరుగున వెళ్ళి కొంతదూరంలో ఉన్న బావిలోని నీళ్ళు చేది ఒక ఆకును దొన్నెగా చేసి దానిలో నీళ్ళు తెచ్చి ఆ అవ్వ మొహాన చిలకరించింది.అవ్వకు ప్రాణం లేచి వచ్చినట్టు అయి మెల్లగా కళ్ళు తెరచింది.కొంతనీరు త్రాగింది.
        "అమ్మా,నా ప్రాణం కాపాడావు"అని నమస్కారం పెట్టింది.
          "అయ్యో,అవ్వా నీవు పెద్ద దానివి నీవు నమస్కారం పెట్టకూడదు"అని నమృతతో చెప్పింది.
కమల మంచితనాన్ని అక్కడే చెట్టు మీద ఉన్న ఓ దెయ్యం చూసింది.అది దెయ్యమయినా కమల మంచితనం దానిని కదిలించింది.
         అది ఒక స్త్రీ గా మారి,కమల దగ్గరకు వచ్చి,"అమ్మాయీ, నీవు ముసలామెను కాపాడావు నీ మంచితనం నాకు నచ్చింది.ఎక్కడికో వెళుతున్నట్టున్నావు?"అడిగింది దెయ్యం.
           "మా నాన్న,అమ్మకు పండ్లు తీసుక వెళ్ళాలి, అందుకే తోటకు వెళ్ళి  తోటమాలి మామయ్యకు ఈ రెండు రూకలు ఇచ్చి  మామిడి పండ్లు తీసుక వెళ్ళాలి ఇంతలో ఈ అవ్వ పడిపోయి కనబడింది.అందుకే నేను చేతనైన సహాయం చేశాను" చెప్పింది కమల.
          దెయ్యం ఒక్కసారి ఆలోచించి కమల మంచితనానికి,తాను మంచి సహాయం చేయాలనుకుంది.
        "పండ్లకోసం అంతదూరం ఏం వెళతావులే, నాదగ్గర మంచి బంగినపల్లి మామిడి పండ్లు నాలుగు ఉన్నాయి తీసుకో,నిన్నటినుండి పండ్లు తిని తిని నాకు అజీర్తి చేసినట్లుంది,నీ విక్కడే ఉండు"అని చెట్టు చాటుకు వెళ్ళి తన మంత్ర శక్తితో నాలుగు మామిడి పండ్లు సృష్టించి తెచ్చి కమలకు ఇచ్చింది.
      కమల రెండు రూకలు ఇవ్వబోతే దెయ్యం స్త్రీ తీసుకో లేదు.కమల రెండు పండ్లను అవ్వకు ఇచ్చింది.
        "నీవు నాలుగు పండ్లు ఇంటికి తీసుక వెళ్ళు,అవ్వకి పండ్లు, మంచి ఆహారం,నీళ్ళు నేను ఇస్తాను"అని చెప్పింది దెయ్యం.
         దెయ్యం స్త్రీకి కృతజ్ఞతలు చెప్పి కమల ఇంటికి వెళ్ళి అమ్మకు పండ్లు ఇచ్చి దారిలో జరిగిన సంఘటన చెప్పింది.
        "మంచి పని చేశావు"అని అమ్మ చెప్పి,పండు ఒకటి కోసింది,అది అధ్బుత రుచితో ఉంది! ఇంతకు ముందు ఏ పండూ అంతరుచిగాలేదు!ఇంకా విశేషమేమిటంటే టెంక బంగారు రంగులో మెరుస్తోంది!పరీక్షించి చూస్తే అది నిజంగానే బంగారు టెంక! కమల మంచితనమే తమకు బంగారు టెంకలు తెచ్చిందని కమల తల్లిదండ్రులు అనుకొని,పరుగున ఆ చెట్టు వద్దకు వెళ్ళారు.
         అక్కడ అవ్వగానీ, ఆ దెయ్యం స్త్రీ గానీ కనబడలేదు, కమలకు చేసిన సహాయం వలన ఆ దెయ్యానికి దెయ్యం జన్మ నుండి విముక్తి కలిగింది.ఆ అవ్వ ఆరోగ్యం బాగై నడిచి వెళ్ళి పోయింది.
         కథ కంచికి ఇక మనం మరొక కథ వ్రాయడానికి ఇంటికి.