జూహ-గాడిద:-- ( అరేబియా జానపద కథ) ---కంచనపల్లి వేంకట కృష్ణారావు=9348611445


    కొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. వారు చేసే పనుల్లో వింత ఉంటుంది!ఒక్కొక్కసారి వారి పనులు ఆనందం,ఆశ్చర్యం కలిగించవచ్చు.మరి కొన్నిసార్లు 'అయ్యో'అనిపించవచ్చు!

             అటువంటి వాడే బాగ్దాద్ లోఉన్న జూహ అనే వింతవ్యక్తి.నిజానికి జూహ చాలా మంచి వ్యక్తి.

అతనికి ఒక గాడిద ఉంది,ఏదైనా పని పడితే ఆ గాడిద మీదే ఎంత దూరం అయినా వెళ్ళేవాడు జూహ.

           ఒకరోజు ఆ గాడిద జూహ పెరడునుండి తప్పించుకుని ఎటో వెళ్ళి పోయింది!జూహ అతని వీధిలోని వారు ఎంత వెదికినా అది కనబడలేదు!

           జూహ వీధి లోకి వచ్చి ఆకాశం వైపు చూడ సాగాడు.అటు వైపు వచ్చిన ఓ పది మంది జూహ ఆకాశ చూపులకు ఆశ్చర్య పోయి వారుకూడా ఆకాశం వైపు చూడ సాగారు! కొంతసేపటికి జూహ "భగవంతుడా,నీవు గొప్ప వాడివి నన్ను రక్షించావు"అని ఆకాశం కేసి చూస్తూ బిగ్గరగా భగవంతుణ్ణి పొగడసాగాడు!

        "అదేమిటి,గాడిద దొరికించు భగవంతుడా అని ప్రార్థించకుండా,నన్ను రక్షించావు అని భగవంతుణ్ణి పొగుడుతున్నావు?" అని వీధిలోని వారు అడిగారు.

          "ఎందుకు భగవంతుణ్ణి పొగిడానంటే,మీకు తెలుసుకదా,నేను గాడిద మీద దూర ప్రాంతాలకు వెళుతుంటాను,అది కనబడక పోయినప్పుడు నేను భగవంతుని దయ వలన నేను దాని మీద లేను,లేకపోతే గాడిదతో పాటు నేనూ కనబడకుండా పోయేవాడిని"చెప్పాడు జూహ.

          "ఔరా, ఈ వ్యక్తి ఆలోచనలే వేరు! "అని నవ్వుకుంటూ జనం వెళ్ళి పోయారు. 

         గాడిద ఓ చాకలి వాడికి దొరికింది, అది జూహాదని తెలిసి వాడు జూహాకు అప్పగించాడు.వాడికి కృతజ్ఞతలు చెప్పి, జూహ భగవంతుణ్ణి ఈవిధంగా ప్రార్థించాడు.

      "భగవంతుడా నన్ను,నా గాడిదను కాపాడావు నిజంగా నీవు గొప్పవాడివి"

       దూరంగా మసీదులో "అల్లాహో అక్బర్" ప్రార్థన వినబడుతోంది.