నిజమైన పాపి:- కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  ఒకసారి యమలోకంలో యముడు,కృష్ణుడు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు.ఇంతలో యమభటులు ఒక పాపిని తీసుక వచ్చారు.వాడు కుడి చెయ్యిలేని వాడని,గర్భ దరిద్రుడనీ,కొన్నిసార్లు దొంగతనం చేసేవాడని,కానీ దొంగతనం చేసిన సొమ్ములో కొంత భాగం దానం చేసే వాడని చిత్రగుప్తుడు వివరించాడు.
        "వీడికేం శిక్ష విధిస్తే  బాగుంటుంది?" అడిగాడు యముడు.
        కృష్ణుడు వాడివైపు పరీక్షగా చూసి,"వెంటనే స్వర్గానికి పంపండి"అన్నాడు.
        యముడు ఆశ్చర్యపోయి "ఇదేమిటి మహానుభావా?" అడిగాడు యముడు.
       "అది అంతే ,తరువాత చెబుతాను,ఆ పాపిని కూడా రానియ్యి"అని యమభటులు తెస్తున్న మరొక పాపిని చూపించాడు శ్రీకృష్ణుడు.
      వాడు ధనవంతుడని,కానీ అనేక మోసాలతో డబ్బు బాగా సంపాదించాడనీ,కానీ పేదలకు చాలా దానాలు చేసి ప్రతిష్ట గడించాడని చిత్రగుప్తుడు వివరించాడు.
       "మరి వీడిని కూడా స్వర్గానికి పంపాలా?"అని నవ్వుతూ  అడిగాడు యమధర్మరాజు.
      "లేదు వీడిని నరకానికి పంపండి"
       "అదేమిటి మహానుభావా వీడికి పూర్తిగా నరకం ప్రాప్తింపచేశావు,ఎందుకీ తారతమ్యం?" అడిగాడు యముడు.
      "వాడు బీదవాడు,అవిటివాడు,కష్టించి పని చేయలేనివాడు,భగవత్ ప్రసాదితమైన ఆకలిని తీర్చుకునేందుకు దొంగతనం చేయవలసి వచ్చింది. అదిగాక వాడు కాస్తంత మంచి బుద్ధితో దానంకూడా చేశాడు.అందుకే దొంగతనం విషయంలో  వాడికి ఏ శిక్షా వర్తించదు.కానీ వాడు మరలా భూమి మీద పుడతాడు.వాడు నిమిత్త మాత్రుడు,అందుకే వాడికి ఉత్తమలోకం ప్రాప్తించింది!ఇక వీడు డబ్బుండి ,సర్వాంగ సంపన్నుడై ఉండి,ఉన్న దానిలో నలుగురికి పెట్టవలసిన వాడు మోసాలతో ధనాన్ని ఆర్జించాడు.తన మోసాల్ని కప్పి పుచ్చుకునేందుకు దాన ధర్మాలు చేశాడు.అందుకే వీడికి నరకం ప్రాప్తింప చేశాను"అని శ్రీ కృష్ణ భగవానుడు యమధర్మరాజు సందేహం తీర్చాడు.