శక్తి అంటే?:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   పదేళ్ళ గోపి బంతితో ఆడుకుంటున్నాడు.బంతి దొర్లుకుంటూ వెళ్ళిఓ బండరాయి కింద కాస్త ఖాళీ ఉంటే దానిలోకి వెళ్ళింది.చేతిని బండ కింద పెడితే బంతి అందలేదు.పుల్ల పోనిచ్చి బయటకు లాగాలని చూశాడు.అయినా బంతి రాలేదు!ఇక లాభం లేదని బండ ఎత్తడానికి ప్రయత్నించ సాగాడు.అయినా బండ కదలటం లేదు!గోపీ మొహం ఎర్రగా మారింది.
        ఇదంతా గుమ్మంలో నిలబడిన గోపీ నాన్న 
 శంకరం గారు గమనిస్తున్నారు.
       ఏమిటి గోపీ బంతి రాలేదా?"అని అడిగారు.
      "బంతి బండ కిందకు పోయింది,రావడం లేదు మరేమో నాశక్తి అంతా ఉపయోగించి బండ ఎత్తాలని ప్రయత్నిస్తున్నాను,బండ లేవ లేదు,బంతి రాలేదు"అమాయకంగా చెప్పాడు గోపి.
       "గోపీ నిజంగా నీ శక్తినంతా ఉపయోగించావా? నీవు ఉపయోగించలేదు!అందుకే బండ లేవలేదు"నవ్వుతూ అన్నారు శంకరం గారు.
      "ఉపయోగించాను నాన్నా" రెండు చేతులు చూపిస్తూ అన్నాడు గోపి.
       "నీ రెండు చేతులే నీ శక్తి కాదు గోపీ నాచేతులు నీ చేతులతో కలిపితేనే నీ శక్తి,అప్పుడే నీ శక్తి పూర్తిగా ఉపయోగ పడుతుంది"చెప్పారు శంకరం గారు.
      "అర్థమయింది నాన్నా...నా శక్తి అంటే నీవు కూడా"చిరునవ్వుతో చెప్పాడు గోపి.
       శంకరం గారు,గోపి కలసి బండ జరిపారు.బంతిని గోపి తీశాడు.గోపీ కళ్ళలో కోటి వెలుగులు కనబడ్డాయి! నాన్నకు థాంక్స్ చెప్పి గోపీ బంతిని తీసుకుని ఆడుకుందుకు పరుగున వెళ్ళాడు.