నగిషీల పాత్ర:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

   ఒకానొక కీకారణ్యం మధ్యలో అటవిక జాతి గుంపు ఉండేది.వారికి ఇతర మనుషులతో పరిచయం లేదు.నాగరికత అంటే ఏమిటో తెలియదు!
         ఒకసారి జయపురం రాజావారు తన సైనికులతో అరణ్యానికి వేటకు వచ్చి,వేట తరువాత అక్కడే భోజనాలు వండుకుని తిని,నీళ్ళు నిలువ చేసే నగిషీల పాత్రని అక్కడే వదలివేసి పరివారంతో వెళ్ళి పోయాడు.
        కొన్ని గంటల తరువాత అటువైపు వచ్చిన ఆ అటవిక జాతి లోని ఒక యువకుడు ఆ నగిషీల పాత్రను చూసి ఆశ్చర్య పోయాడు.ఇంతకు మునుపెప్పుడూ వాడుకానీ,ఆ అటవికులెవ్వరు గానీ అటువంటి పాత్ర చూసి ఎరుగరు!పాత్రను ఇటు అటు తిప్పి చూసి తన గూడేనికి తీసుక వెళ్ళాడు.మిగతా అటవికులు ఆ పాత్రను చూసి ఆశ్చర్య పోయారు,దానిలో నీళ్ళు పోసుకుని త్రాగ సాగారు,ఒక్కొక్కసారి దానితో గింజలు నలగొట్టుకునే వారు,అటవిక పిల్లలు దానితో ఆడుకునే వారు!ఇలా ఆ పాత్ర వారి జీవితాల్లో ఒక భాగమయిపోయింది!ఆ నగిషీల పాత్ర మీద ఆధిపత్యం సంపాదించాలని వారిలో వారికి పోటీ ప్రారంభమయింది!
        అంతవరకు ప్రశాంతంగా ఉన్న వారి మధ్య ద్వేషం మొదలయింది.ఆ పాత్ర కోసం వారిలో వారికి తగవులు ప్రారంభం అయ్యాయి!గూడెంలో అశాంతి మొదలయ్యింది.
        ఇదంతా గమనిస్తున్న ఆ గూడెంలోని ఒక పెద్దాయన అందరినీ సమావేశ పరిచి ఈ విధంగా చెప్పాడు.
       "ఈ పాత్ర దొరికినప్పటినుండి మనలో మనకి ద్వేషాలు పెరిగి పొయ్యాయి,ఈ పాత్ర కోసం తగవులు మొదలయ్యాయి.ఇప్పుడు మనకు శాంతి కరవైంది.అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను,మీ 
అందరికీ ఇష్టమైతే ఆ పాత్రని మన భూమికి అవతల పారవేస్తే మనలో తగవులు,ద్వేషాలు తొలగి పోతాయి"చెప్పాడు ఆ పెద్దాయన.
       ఆ సూచన అందరికీ నచ్చింది,పాత్ర పారవేయడానికి ఒప్పుకున్నారు.
        ఆ పాత్ర తెచ్చిన యువకుడికే ఆ పాత్ర పారవేసి రమ్మని చెప్పారు.ఆ యువకుడు ఒప్పకుని భూమి అవతలకు వెళ్ళాలని అడవిలో చాలా దూరం వెళ్ళాడు,అయినా వాడికి భూమి చివర కనబడలేదుకానీ కొంచెం దూరంలో ఓ ఊరు కనబడింది! ఇంతకు మునుపు ఎప్పుడూ వాడు అటువంటి ఊరు చూసి ఎరగడు,అలానే కొంత దూరం వెళ్ళేసరికి ఒక రచ్చబండ దగ్గర గట్టిగా ఏ విషయం మీదో  కొందరు వాదులాడుకుంటున్నారు.వారి వాదు లాట చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు.ఆ రచ్చబండకు కొద్ది దూరంలోనే ఒక అంగడిలో నగిషీల పాత్రలు అమ్ముతున్నారు.ఆ పాత్రలు చూసిన ఆ యువకుడు ఆశ్చర్య పోయాడు.ఆ పాత్రల వలనే అక్కడివారు వాదులాడుకొంటున్నారనివాడు అనుకొన్నాడు!ఇక చేతిలో ఉన్న ఆ పాత్ర మీద పూర్తి విరక్తి కలిగింది!మరికొంత దూరం నడిచాక వాడికి ఒక పెద్ద పంట కాలువ కనబడింది.ఆ పాత్రను ఆ కాలువలోకి గిరవాటు వేశాడు.ఆ నీటి ప్రవాహంలో అది కొట్టుకపోయింది.వాడు తృప్తిగా ఆ కాలువకేసి చూసి వడి వడిగా తిరిగి అరణ్యంలోకి వెళ్ళి పోయాడు.
        వట్టి చేతులతో తిరిగి వచ్చిన వాడిని చూసి గూడెంలోని వారు ఎంతో సంతోషించారు.వాడు వారికి ఊర్లో తాను చూసినవన్నీ చెప్పేసరికి,ఆ పాత్ర పారవేయడమే ఎంతో మంచిదయిందని గూడెంలో అందరూ అనుకున్నారు.
(Based on *Gods must be crazy*  movie)
                ******************