దేవుని హుండీ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445


     గిరిజ దేవుని వద్ద ఒక హుండీ పెట్టింది.పూజ తరువాత రోజూ తన దగ్గర మిగిలిన డబ్బులు హుండీలో వేస్తుండేది.అలా హుండీ నిండి పోయింది.

      "ఏమండీ, దేవుని వద్ద హుండీ నిండి పోయింది,ఆ డబ్బులు మన ఆంజనేయ స్వామి గుడిలో హుండీలో వేస్తాము,ఆ హనుమంతుడు మనల్ని కాపాడుతుంటాడు కదా,ఆ డబ్బులు దేవాలయం అభివృద్ధికి ఉపయోగ పడతాయి"అన్నది గిరిజ.

      "సరే రేపు మంగళవారం స్వామికి ఇష్టమైన రోజు,పొద్దున్నే వెళ్ళి స్వామికి అర్చన చేయించి ఆ డబ్బులు వేద్దాం" చెప్పాడు రఘుపతి.

      అలా మంగళవారం రఘుపతి,గిరిజ శుభ్రంగా స్నానం చేసి,దేవుని హుండీలో డబ్బులు లెఖ పెడితే అందులో తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉన్నాయి.ఎంతో భక్తితో ఇద్దరూ గుడికి బయలు దేరారు.

       అలా కొంత దూరం వెళ్ళాక వాళ్ళ వీధిలో ఉన్న నానీ ఏడుస్తూ రఘుపతి,గిరిజ వద్దకు వచ్చాడు.నాని రఘుపతి వాళ్ళ పనిమనిషి ఆదెమ్మ కొడుకు.వాళ్ళు చాలా బీదవాళ్ళు.

       "ఏమయింది నానీ ఎందుకు ఏడుస్తున్నావు?"అడిగాడు రఘుపతి.

       "సార్ మా అమ్మకు కడుపు నొప్పి వచ్చింది,నాన్న  పనికి బొంబాయి పోయాడు,పక్కింటి వాళ్ళు అమ్మను ఆసుపత్రిలో చేర్చారు.మందులకు డబ్బులు లేవు,మీరే మా అమ్మను కాపాడండి"అని కన్నీళ్ళతో చెప్పాడు.

      రఘుపతి,గిరిజ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.ఇంట్లో కానీ,బ్యాంకులో కానీ ప్రస్తుతానికి డబ్బులు లేవు!

         "గిరిజా, మానవ సేవే మాధవ సేవ అన్నారు,మొదట నానీ వాళ్ళమ్మకి ఈ డబ్బు ఎంతవరకు ఉపయోగ పడితే అంతవరకు ఉపయోగిస్తాం,తరువాత హుండీలో డబ్బు వేయడం గురించి ఆలోచిద్దాం,మనం చేసే ఈ మంచి పనికి తప్పక దేముడు కూడా సంతోషిస్తాడు.ఏమంటావు" చెప్పాడు రఘుపతి.

       "ఏమండీ మీ మంచి ఆలోచనల్ని నేను ఎన్నడూ కాదనలేదు,మొదట ఆసుపత్రికి వెళ్ళి ఆదెమ్మకు సహాయం చేద్దాం పదండి" 

         నానీని తీసుకుని రఘుపతి,గిరిజ ఆసుపత్రికి వెళ్ళారు.

          ఆసుపత్రిలో ఆదెమ్మకు సెలైన్ బాటిల్ పెట్టిఉంది.అక్కడి డాక్టర్ని ఆదెమ్మ ఆరోగ్యం గురించి అడిగారు.

        "సీవియర్ గాస్ట్రో ఎంటిరైటస్ కొన్ని మందులు వాడితే తగ్గి పోతుంది"చెప్పాడు డాక్టర్.

       రఘుపతి మందుల చీటీ తీసుకుని మందుల షాపుకి వెళ్ళి మందులు తెచ్చి ఇచ్చాడు.వెంటనే

డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి ఏమందు ఎప్పుడు వెయ్యాలో చెప్పి వెళ్ళాడు.

        ఆదెమ్మ రెండోరోజుకే కోలుకో సాగింది.మూడో రోజుకు ఆదెమ్మ భర్త ముంబాయి నుండి వచ్చి ఆదెమ్మను చూసిన తరువాత రఘుపతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టి,"అయ్యా,మీరు సమయానికి సహాయం చేసారు మీ మేలుమరచి పోను ఇదుగోండి డబ్బులు"అంటూ వెయ్యి రూపాయలు ఇచ్చాడు.

         "వద్దురా,ఆదెమ్మ మా ఇంట్లో మనిషి లాటిది దానిది కష్ట పడే గుణం,మాకు డబ్బు వద్దు,ఆ డబ్బుతో దానికి మందులు,మంచి తిండి పెట్టు"ఆ ఆంజనేయుడు అందరినీ కాపాడుతాడు"అని చెప్పి డబ్బును సున్నితంగా తిరస్క రించాడు రఘుపతి.

          ఎదురుకుండా గోడమీదనున్న కాలెండర్ లో ఆంజనేయుడు దీవిస్తున్నట్టుగా ఉంది!

      ఆదెమ్మ భర్త నమస్కారం పెట్టి వెళ్ళాడు.