విచిత్ర రాజు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  కుంతల దేశ రాజు విచిత్ర సేనుడు. పేరుకు తగ్గట్టే ఆయన విచిత్రమైన వ్యక్తి ఏపని చేసినా ఏదోక విచిత్రం ఉంటుంది.
       ఒక రోజు శారదానందుడు అనే కవి ఓ చిన్న కావ్యం వ్రాసుకుని విచిత్రసేనుడి దర్బారుకు వచ్చాడు.ఆకావ్యం హనుమంతుని లీలలనుగురించి.
ఆ కావ్యం లోని కొన్ని పద్యాలు విన్నాక విచిత్ర సేనుడు అర్థం లేని కొన్ని ప్రశ్నలు అడిగాడు.ఆంజనేయుడికి తోక ఎందుకని? అసలు హనుమంతుడు ఎగిరి ఆకాశంలో ఎలా నిలువ గలిగాడన్న వంటి ప్రశ్నలు.
       రాజు ప్రశ్నలకు మనసులోనే ఈ పిచ్చి ప్రశ్నలు ఏమిటా అనుకున్నాడు.అయినా రాజు శారదానందుడికి మంచి బహుమతి ఇచ్చి పంపాడు.
ఇంటికి వెళ్ళిన శారదానందుడు రాజు అడిగిన ప్రశ్నలను గురించి తీవ్రంగా ఆలోచించాడు.
       ఆ రాత్రికే అతని మనస్సులో 'పురాణాల్లోసూక్ష్మాలు'అనే గ్రంథం వ్రాయడానికి ప్రణాళిక రూపు దిద్దుకొంది!
         రాజు సభలో ఉండగా భటులు ఒకడిని దొంగతనం నేరం మీద రాజు ఎదుట ప్రవేశ పెట్టారు.
వాడిని రకరకాల తల తిక్క ప్రశ్నలు అడిగాడు.వాడు అసలే భయంతో ఉన్నాడు.ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక పోయాడు.
        రాజు పెద్ద నవ్వునవ్వి"దొంగతనం ఒక తప్పు,నాప్రశ్నలకు జవాబు చెప్పలేక పోవడం మరొకతప్పు అందుకే నీకు శిక్ష విధిస్తున్నాను"అని చెప్పి ఒక వెదురు గంప తెప్పించి దానిలో నీళ్ళు నింపి తన తోటలో చెట్లకు నీళ్ళు పోయమని చెప్పాడు! ఆ గంపలో అసలు నీళ్ళు ఎలా నిలుస్తాయి?ఏవిధంగా చెట్లకు నీళ్ళు పోయాలో వాడికి అర్థం కాలేదు! అయినా రాజుగారి ఆజ్ఞ కనుక తోటకు వెళ్ళి గంపతో నీళ్ళు తెచ్చి పోయడానికి ప్రయత్నించ సాగాడు.
చెట్టు దగ్గరకు తెచ్చే లోపలే నీళ్ళు కారిపోసాగాయి.అయినా కొద్ది నీరు కారుతూ కొన్ని చెట్ల మధ్య పడిపోసాగాయి! త్వరలోనే ఆ చెట్లు పచ్చదనం సంతరించుకున్నాయి!
       రాజు వచ్చి తోట చూసి వాడిని మెచ్చుకుని ఈ విధంగా చెప్పాడు,"దొంగతనం మాను నాతోటలో తోటమాలిగా చేరు,నెలకింత ఇస్తాను"అని చెప్పాడు.
    చూశారా, రాజు చేసే వింత పనులు వలన ఇతరులకు  లాభం,కొంత మంచి కూడా జరిగింది.కొన్ని విచిత్రాలు అలాగే ఉంటాయి!ఇటువంటి విచిత్ర కథ మీరూ ఆలోచించండి.