శక్తిశాలి:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716.

 శివపురరాజ్యాన్ని పరిపాలించే శివవర్మకు విజయసేనుడు,వజ్రసేనుడు అనే ఇద్దరు కొడుకులున్నారు.వారు కవలలు. జ్ఞానంలో ,శక్తిలో,విలువిద్యల్లో,ధైర్యసాహసాల్లో సమంగా ప్రతిభ కనపరిచేవారు. రాజుకు తన తర్వాత ఎవరికి పట్టాభిషేకం చేయాలాఅనే సమస్య వచ్చింది. ఈవిషయం మంత్రి సువర్ణుడితో చర్చించాడు. మంత్రికి ఆబాధ్యతను అప్పగించాడు.
మంత్రి రాకుమారులకు అనేకరకాల పోటీలు ఏర్పాటుచేశాడు.ఇద్దరూ ప్రథములుగా నే నిలిచారు.పోటీలు పూర్తిఅయ్యేసమయానికి రాత్రయింది.
"బాగా పొద్దుపోయింది. ఈరోజు మాతో కలిసి భోజనం చేసి వెళ్లండి" అని మంత్రిని ఆహ్వానించాడు రాజు. వంటపని పూర్తయ్యాక వంటవాని పిలుపుతో శివవర్మ, విజయసేనుడు,వజ్రసేనుడు,మంత్రి సువర్ణుడు భోజనానికి కూర్చున్నారు. రాజు,మంత్రి మాట్లాడుతూ భోజనం నోటిలో పెట్టుకోలేదు. రాకుమారులిద్దరూ మొదటి ముద్ద పెట్టుకున్నారు. భోజనం అతి ఉప్పగా,కారంగా ఉండి నోరు భగ్గుమంది. వెంటనే వజ్రసేనుడు వంటవాన్ని పిలిపించి, ఆవేశంగా తిట్టాడు. కఠినంగా శిక్షిస్తేకానీ బుద్దిరాదని కేకలు వేశాడు. 
విజయసేనుడు కల్పించుకుని"  ఇక వదిలేయ్!రోజూ ఇలా జరుగుతోందా? రుచికరంగానే తింటున్నాం కదా! ఏదో ఈరోజు పొరపాటు జరిగిందంటున్నాడుగా! పొరపాటు మానవ సహజం. అంతమాత్రానికే ఎందుకలా తిడతావ్?కఠినంగా శిక్షించాలనుకోవడం సరికాదు"అన్నాడు ప్రసన్నవదనంతో.
తిరిగి వంట చేయించుకుని భోజనం చేశారు.
మరుసటి రోజు మంత్రి రాజుతో "రాత్రి వంటలో ఉప్పూ కారం నాటకం వంటవాడితో నేను చేయించిందే! కోపాన్ని నిగ్రహించుకునేవాడే నిజమైన శక్తిశాలి. పరిస్థితిని విశ్లేషించుకుని, అర్థంచేసుకునేవాడే నేర్పరి. ఏస్థాయిలో ఉన్నా అహంకారాన్ని దరిచేరనియ్యనివాడే సుగుణవంతుడు.అనవసరమైన ఆవేశంతో విచక్షణ కోల్పోతాము. ఈమంచిలక్షణాలు వజ్రసేనుడిలో లేవు. విజయుడిలో ఉన్నాయి. ఈవిషయం రాత్రి వంట విషయంలో ఋజువయింది. కాబట్టి విజయుడికే రాజుకాగల అర్హత ఉంది" అన్నాడు.ఇద్దరిలో విజయసేనుడిని రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేశాడు రాజు. వజ్రసేనుడిని,విజయసేనుడికి సహాయకుడిగా నిర్ణయించాడు.