పవనుడికానుక:-డి.కె.చదువులబాబు-9440703716


 ప్రమదరాజ్యం రాజు ప్రభాకరుడు. ఆయన ఒక ఉన్నత అధికారి పదవికి అభ్యర్థులకోసం ప్రకటనిచ్చాడు. అనేకమంది హాజరయ్యారు. వారి విద్యార్హతలు,ప్రతిభాపాటవాలను అనేకవిధాలుగా పరీక్షించారు. చివరకు తన్మయుడు,ధమనుడు,నందనుడు,పవనుడు ఎన్నికలో నిలబడ్డారు. రాజు ఆ నలుగురికీ ఒకొక్కరికి యాభైవేలవరహాలిచ్చి  ఆ ధనంవెచ్చించి తనకు కానుక తెచ్చివ్వమన్నాడు. నలుగురూ నాలుగుదిక్కుల బయలుదేరారు.

రాజు కళాహృదయం కలవాడు. శిల్ప,చిత్రలేఖనాలంటే అభిమానం. కాబట్టి జీవం ఉట్టిపడే మంచి అరుదైనచిత్రాలను, శిల్పాన్ని కానుకగా ఇస్తే సంతోషిస్తాడని తన్మయుడు కష్టపడితిరిగి ఆపనిచేశాడు.

ధమనుడు అనేకచోట్లవెదికి ఒక మాట్లాడే విలువైన చిలుకను, బంగారువర్ణంలో తళతళ మెరిసే ఫింఛమున్న, చక్కగా నాట్యంచేసే విలువైన నెమలిని కొనితెచ్చాడు. 

రాజుకుగుర్రాలంటేఇష్టంగుర్రాలనుకానుకగాఇస్తేసంతోషిస్తాడనిమేలుజాతిఅరేబియన్

గుర్రాలనుకొనితెచ్చాడు నందనుడు.

పవనుడు ఏ కానుకా తేకుండా రాజు ఇచ్చిన ధనం సైతం లేకుండా ఒట్టి చేతులతో వచ్చాడు. కానుక ఏదని రాజు ప్రశ్నించాడు.

"మహారాజా!క్షమించండి. కనీసం  ఒక్కపూటయినా కడుపునిండా తినటానికి లేని అనాథలయిన వృద్దులకు, దివ్యాంగులకు,కడుపేదలకు ఒక్కపూటయినా కడుపునిండా మంచిభోజనం పెట్టాలనేది నా చిరకాల కోరిక.అందుకు నాశక్తి చాలదు. కాబట్టి నాశక్తిమేర చిన్నచిన్నదానాలు చేసేవాడిని. ఆరోజు ఇంత ధనం నాచేతికి మీరివ్వగానే ఆధనంతో మీరు పంపారని చెప్పి   మీపేరుమీద అన్నదానం, వస్త్రదానం చేశాను..ఈవిధంగా నా చిరకాలకోరిక తీర్చుకున్నాను.  నాకు ఏశిక్షవిధించినా అనుభవించడానికి సిద్దంగా ఉన్నాను."అన్నాడు.

"నీవు చేసిన పనిని మావార్తాహరులు నాకు ముందే చేరవేశారు. పక్షంరోజులక్రితం నేను మారువేషంలో రాజ్యంలో సంచరిస్తూ సరైన తిండి,దుస్తులు,నిలువనీడలేని అనాధలను చూశాను.అలాంటి వారికోసం రాజ్యమంతటా ఆశ్రమాలు నిర్మించి వారిని ఆదుకోవాలని    నిర్ణయించుకున్నాను. ఈఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవినీతిలేకుండా నిర్వహించడానికి

దయాగుణమున్నఅత్యున్నత అధికారి అవసరం ఏర్పడింది.అందుకోసమే ఈఎన్పిక.ముగ్గురూ ధనాన్ని విలాసవంతమైన వస్తువులకోసం, గుర్రాలకోసం ఉపయోగించారు. నీవు మానవసేవ కోసం ఉపయోగించావు. నా రాజ్యప్రజలకు నీవు సమకూర్చినవన్నీ నిజానికి నాకు కానుకగా ఇచ్చినట్లే.ఈపదవికి నిస్వార్థమైన సేవాగుణంకల నీవే అర్హుడివి" అని పవనుడిని అనాధఆశ్రమాల నిర్మాణ,నిర్వహణ అధికారిగా నియమించాడు.