నందుడినిర్ణయం:-డి.కె.చదువులబాబు-9440703716.

 

రామాపురంలో నందుడు అనే యువకుడు ఉండేవాడు.వాడు పొలం పనులు చేసుకునేవాడు.నందుడికి పడవ ప్రయాణం అంటే ఇష్టం.
 ఒకరోజు తీరికవేళ పడవలో వెడుతుంటే తుఫాను వచ్చి పడవ తిరగబడింది. వాడు ఈదుతూ ప్రవాహం వెంబడి కొట్టుకుపోయి ఒడ్డుకు చేరాడు. అక్కడికి కొంత దూరంలో ఏదో ఊరు కనిపిస్తూంటే నడుచుకుంటూ ఊళ్ళోకి పోయాడు. రాత్రి కావడంతో ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బసచేశాడు. ఆరాత్రి పెద్దమ్మ దిగులుగా కూర్చుని గొణుక్కుంటూ ఉంది.నందుడు కారణమడిగాడు. 
అప్పుడు పెద్దమ్మ "నాయనా!ఈనగరం బయట అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి రోజూ గంపెడు పరమాన్నం, ఒక మనిషిని ఆహారంగా పంపాలి. లేకుంటే నగరం మీదపడి అందరినీ తినేస్తాడు. వాడు రేపటిదినం మారాజు కూతురును ఆహారంగా పంపమన్నాడు. రాజు, ఆయన కుటుంబం చాలా మంచివారు. అందుకు దిగులుగా ఉంది" అని చెప్పింది. 
అప్పుడు నందుడు "ఎన్నాళ్లని రాక్షసుడి బాధ పడతారు. రేపు నేను వెడతాను. ఏదో ఒకటి చేసి వాడి పీడను వదిలిస్తాను"  అన్నాడు.
ఉదయమే రాజును కలిసి, రాజు అనుమతితో పరమాన్నం, ఆకుపసరు తీసుకుని రాక్షసుని వద్దకు బయలుదేరాడు .దారి వెంట నిశితంగా పరిశీలిస్తూ ఆలోచిస్తున్నాడు. అడవికి దగ్గరలో పాడుబడిన, చుట్టూ గోడలు లేని దిగుడు బావి కనిపించింది. ఎవరూ పొరపాటున బావిలో పడకుండా దానిపై ఒక రాతిపలకను ఉంచారు. దాన్ని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. నందుడు తన శక్తినంతా ఉపయోగించి పలకను తీసేశాడు. అక్కడ పరమాన్నం పాత్రను దించి నిలబడ్డాడు.ఆకుపసరును పరమాన్నంలో కలిపాడు.
ఎంతకూ ఆహారం రాకపోవడంతో ఆకలితో ఉన్న రాక్షసుడు చల్లగాలికి వస్తున్న పరమాన్నంవాసన, మనిషివాసన గుర్తించి అక్కడికొచ్చాడు.వెంటనే పరమాన్నం గబగబా తినేశాడు. రాజు కూతురు కనిపించకపోయేసరికి కోపంతో అరిచాడు. నందుడి మీదకు దుమికాడు. నందుడు వెంటనే బావి దగ్గరనుండి పక్కకు తప్పుకున్నాడు.అప్పటికే పసరు ప్రభావంతో వాడి కళ్ళు తిరుగుతున్నాయి. రాక్షసుడు బావిలో పడిపోయాడు. తల పగిలి చనిపోయాడు.నందుడు తిరిగివచ్చి, జరిగిన విషయం రాజుకు చెప్పాడు. రాజు నందుడికి తన కూతురునిచ్చి వివాహం చేస్తానన్నాడు.
నందుడు అందుకు ఒప్పుకోక" మహారాజా!నాకు పొలంపనులు చూసుకోవడం, పడవ ప్రయాణం చేయడం ఇష్టం. నాకు ఏ అర్హతలున్నాయని రాకుమారిని వివాహమాడాలి.రాజుకూతురును రాజకుమారుడు వివాహం చేసుకుంటేనే బాగుంటుంది.ఏ అర్హతలూ లేకుండా అందలమెక్కాలనుకోవడం అవివేకం" అన్నాడు.
తర్వాత రాజునుండి ఒక మంచి పడవను బహుమానంగా స్వీకరించి, తన ఊరిదారి అడిగి జలమార్గంద్వారా ప్రయాణమయ్యాడు.
'కొందరు మహాత్ములు నిస్వార్థంగా లోకం కోసం మంచిపనులు చేస్తుంటారు' అనుకుంటూ రాజు,పేదరాశిపెద్దమ్మ, ఆనగరప్రజలు నందుడికి చేతులెత్తి నమస్కరిస్తూ వీడ్కోలు పలికారు.