*జై భజరంగ భళీ!*:- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,చిట్యాల,నల్గొండ,9542236764
ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాస అహరహం
శ్రీరామనామ జప నిత్య సంకీర్తన స్మరణమో
ఎవరు భక్తి భావానికి నిలువెత్తు నిదర్శనమో 
పట్టుదలకు చిరునామాగా నిలిచిన చిరంజీవెవరో
వానరవతార నరజాతి స్ఫూర్తిదాయక దైవమతడు
 
ఎవరు శాస్త్రాన్ని ఉపాసన పట్టిన సకల కోవిదుడో
సుగ్రీవుని కొలువున రాణించిన మంత్రివర్యులెవరో 
ఓర్పు నేర్పు తర్ఫీదు పొందిన సహన మూర్తిగా             
భూజాత అన్వేషణలో విజయ సాధకుడు
అసాధ్యం సుసాధ్యం చేసే అతి పరాక్రమ వీరుడు 

వాయు వేగ గమన మారుతాత్మజుడు
నిరహంకార నిర్భయ మహా బలుడు
అనంత శక్తి యుక్తుల సృజన శీలుడతడు 
కార్యదక్షత కర్తవ్య పాలన ఊపిరైన శ్రమయోధ
సంజీవినితో లక్ష్మణునికి ప్రాణభిక్ష పెట్టిన ప్రాణధాత

భగవాన్ హనుమ జీవనం ఆదర్శనీయం 
అణువణువు అపార స్వామి భక్తికి సంకేతం
అకుంఠిత దీక్ష అపూర్వ నమ్మకానికి ప్రతిరూపం 
వినయ విధేయత చిగురు లేసే సంస్కార వృక్షం 
భూత ప్రేత పిశాచాల నెదిరించే అసమాన ధీశాలి

సింధూర ప్రియుడు సమర్ధ గుణ సంపన్నుడు
వైశాఖ బహుళ దశమి హనుమాన్ జన్మ శుభదినం
ఆజన్మ బ్రహ్మచారి!అంజనీ పుత్ర! జై భజరంగ భళీ!
వజ్రకాయ వీరాంజనేయ!శ్రీరామదూత శిరసా నమామి!