*ఆరోగ్య ప్రదాయిని*:-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,చిట్యాల,నల్గొండ,9542236764
విభిన్న వైద్యప్రక్రియల పరంపరలో విశిష్టస్థానం 
అస్వస్థత నుంచి స్వస్థత వైపు శాశ్వత ప్రస్థానం
అష్ట విభాగాల సంయోగ సనాతన వైద్య సోపానం 
మొండి జబ్బుల తరిమే బలమైన శక్తి పుంజం

ఆకు లలములు వేళ్ళు సంగీత సరిగమలతో                                                          
పంచభూత ప్రకృతి ప్రసాదిత చికిత్సా విధానం 
చతుర్వేదాలలో నిక్షిప్తమైన ఆరోగ్య జీవన వేదం 
అఖండ భారత మూలికా చూర్ణ వజ్రాయుధం 

తరతరాల తరగని స్వదేశీయ సహజ సంపద
మణి మాణిక్యాల మూలికామృత బాండాగారం
భారతీయ సంస్కృతీ వైభవం చాటే మహా భాగ్యం 
ఆయుష్షు పెంచే అలనాటి అమోఘ వైద్య ప్రసాదం  

నిలువ ఉంచే సాధనంగా ఉప్పు ఘనతని చాటి 
సర్వరోగ నివారిణి వేపను పరిచయం చేసి 
పెను గాయం కుళ్లకుండా పసుపు పైపూతగా        
ఆయుర్వేద ఆదివైద్యుడు ధన్వంతరి మహాత్మ్యం
చరక సుశ్రుత వాగ్బటు వైద్యరత్నాల శ్రమ ఫలం

వాత పిత్త కఫ శ్లేష్మ దోషాలే రోగ మూలాలనీ 
సరైన ఆలోచనలే సంపూర్ణ ఆరోగ్యానిస్తాయని 
ఆహారమే ఔషధమై రసాయన మందులకు దూరంగా
వ్యక్తిగత పరిసర పరిశుభ్రత పాటించమన్నది 
 
పరికరాలతో పనిలేని సాంకేతిక అవసరం రాని
అనర్థాలు లేని ఔషధ ఆవశ్యకత గుర్తించే దెపుడో?
ఆయుర్వేదంపై పలు పరిశోధనలు జరిగిన దినం 
సర్వ మానవాళికి ఆరోగ్య ప్రదాయిని ఆయుర్వేదం!