*కలం - కాగితం* (కథ):-.గంగశ్రీ 9676305949

   ఘణపూర్ ఉన్నత పాఠశాలలో విక్రమ్ ఏడవ తరగతి చదువుతున్నాడు. అతనికి హోంవర్క్ చేయడమంటే చాలా బద్ధకం. రోజూ నాలుగైదు దెబ్బలైనా భరించేవాడు కానీ, హోంవర్క్ మాత్రం చేసేవాడు కాదు! కానీ విక్రం మాత్రం అందరి కన్నా ఎక్కువగా కాపీలు పెన్నులు కొనేవాడు. వాళ్ళ నాన్న మా అబ్బాయి చాలా బాగా చదువుకుంటున్నాడన్న సంతోషంతో అడిగినన్ని కాపీలు, పెన్నులు కొనిచ్చేవాడు.

            అలా తన కాపీల లోంచి కాగితాలను చించి పేపర్ రాకెట్స్, పడవలు, విమానాలు, పువ్వులు వగైరా చేస్తూ ఆనందించేవాడు. వాటితో ఆడి ఆడి తరగతి గదిలోనే చెత్తను వేసేవాడు.  పెన్నులతో బెంచీలు, బల్లలు, గోడలపై ఏవో పిచ్చి గీతలు గీసేవాడు. విక్రమ్ హోం వర్క్ ఎందుకు చేయట్లేదని ఉపాధ్యాయులు అడిగితే కాపీలు లేవు, పెన్నులు లేవని, పైగా మా నాన్న కొనించడంలేదని అబద్ధం ఆడేవాడు. ఉపాధ్యాయులందరూ ప్రధానోపాధ్యాయులకు కంప్లైంట్ చేస్తే, ఒకరోజు హెచ్ ఎం గారు విక్రమ్ వాళ్ల నాన్నను పిలిపించి విషయం చెపితే, వాళ్ళ నాన్న విస్తూపోయాడు.
              విక్రమ్ ను పిలిచి బ్యాగ్ చెక్ చేస్తే, స్వీట్స్ లేని ఖాళీ డబ్బాల్లా, కాగితాలు లేని కాపీలు, అరిగిపోయిన పెన్నులు ఎన్నో ఉన్నాయి. విషయం అర్థమైన వారు విక్రమ్ ని ఎలాగైనా మార్చాలని అనుకున్నారు. ఈ బాధ్యతను సైన్స్ టీచర్ కి అప్పగించారు.
             మరునాడు సైన్స్ టీచర్ నాగరాజు సార్ కాగితం తయారీ గురించి క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా కాగితంపై మనం రాసే అక్షరాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలని, కత్తి కన్నా కలం చాలా శక్తివంతమైనదని వివరించారు.
మెదక్ లో ఒక విద్యార్థిని తన అందమైన చేతి రాతతో ఒక నీతి కథను స్వతహాగా రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే లక్ష లైకులు దాటి ప్రధానమంత్రి ని చేరింది. ప్రధాన మంత్రి గారు ఆ కథను చదివి ఎంతో మెచ్చుకున్నాడని, అదేవిధంగా మీరు కూడా కాగితం, కలం సరిగ్గా వాడితే ప్రపంచ గతిని మార్చవచ్చని చెప్పడంతో ఆనాటి నుండి విక్రమ్ తన అలవాటును మాని వాటిని సరిగ్గా వాడడం మొదలు పెట్టాడు. పెద్దయ్యాక ఎన్నో పరిశోధనలు చేసి,  ఉపయుక్తమైన సిద్ధాంత గ్రంథాలు రాసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు.