ధరణికి పెళ్లై నాలుగేళ్లైనా, జోల పాటలు లేక ఇల్లంతా బోసిపోయింది. ఆలస్యమైనాకొద్దీ ఆమెకు పిల్లలపై ఆపేక్ష విత్తనం పెరిగి వృక్షమైంది. దాంతో ఇరుగు పొరుగు పిల్లలను చేరదీసి లాలించేది. పిల్లల కోసం కనబడ్డ చెట్టుకు అభిషేకం, పుట్టలో పాలు పోయడం, రాయికి, రప్పకి బొట్టు పెట్టి పూజ చేయటం నిత్యకృత్యమైంది.
ఏ పూజ ఫలించిందో కానీ, ఏడాది తిరిగే సరికి ఇంట్లో లాలిపాటలు వీణా వాయించినట్టు వినబడ్డాయి. బాబు పుట్టిన ఆనందంలో తనుంటే, నెల్లాల్లకే విధి, వీధి నాటకమాడి భర్తను బలితీసుకుంది. బాబు ధన్వంతరి బోసినవ్వులతో అమ్మను ఓదారుస్తుంటే, ధరణి తొందర్లోనే కోలుకుంది. అంతలోనే "ఎడారిలో దొరికిన గుక్కెడు నీళ్లు నీరెండకు ఆవిరైనట్టు!" ధన్వంతరికి చెవులు మందగించినై! "కొండ మీది నుంచి బండ రాయి దొర్లినట్టు" జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొస్తుంది ధరణి.
ధన్వంతరికి ఆరేళ్లు నిండడంతో, బడికి పంపాలని దగ్గర్లోని బడికి తీసుకెళ్తే చెవిటి వాడని ఎవరూ చేర్చుకోవట్లేదు. మంచి మనసున్న మాధవి టీచర్ బడికెళ్ళి ప్రాధేయపడ్డా, ఇతర పిల్లలకు ఇబ్బందవుతుందని సున్నితంగా తిరస్కరించింది! చేసేది లేక బడి బయట కూర్చొని ఏడుస్తుంటే, అనాధలకు, అవిటి వారి కొరకు పాఠశాలను నడిపిస్తున్న కరుణ టీచర్ కరుణించి ధన్వంతరిని తన పాఠశాలలో చేర్చుకొని, ఒక ఆయుర్వేద వైద్యునికి చూపించగా ఏడాదికల్లా సప్తస్వరాలను వినగలిగాడు ధన్వంతరి!
బాగా చదివి డాక్టరై, పేదవాళ్ల డాక్టరని పేరు తెచ్చుకున్నాడు ధన్వంతరి. ఒకరోజు మాధవి టీచర్ కి చెవిలో నొప్పిగా ఉండడంతో, పేరు పొందిన ధన్వంతరి దగ్గరికి వెళ్లగా, ఆమెను గుర్తు పట్టి నమస్కరించి గతం గుర్తు చేశాడు ధన్వంతరి.
"క్షమించమంది!" మాధవి టీచర్.
"మీకు చాలా ధన్యవాదాలు మేడం!" అన్నాడు వినయంగా
"ఎందుకు బాబు?" అంది మాధవి టీచర్ విస్మయంగా!
"అప్పుడు మీరు నన్ను తిరస్కరించక పోతే నాకు కరుణా టీచర్ దొరికేది కాదుగా!" అన్నాడు మృధువుగా.
అతని మంచితనాన్ని మనసులోనే శ్లాఘించి, తనూ కరుణా టీచర్ లా కావాలనుకుంది.! మాధవి టీచర్.
..
"కర్ణా'కరుడు":-.గంగశ్రీ--9676305949
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి