మార్చిన కథలు. (కథ):-గంగశ్రీ--9676305949
  తడకపల్లి గ్రామంలో మౌనిక తొమ్మిదవ తరగతి, వాళ్ళ తమ్ముడు భాను ఆరవ తరగతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ల నాన్న రమేష్ గ్రామంలో టెంట్ హౌస్ వ్యాపారం, అమ్మ అన్నపూర్ణ ఇంటి పనులు చేస్తూ ఉండేవారు.అన్నపూర్ణ తీరిక వేళల్లో కథలు రాస్తూ ఉండేది. మౌనిక చదువులో బాగానే ఉన్న ఇంటి పనుల్లో మాత్రం వెనుకబడింది. కరోన వల్ల స్కూల్ కి సెలవులు రావడంతో తమ్ముడు భానుతో కలిసి టీవీలో సినిమాలు, మొబైల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుండేది. ఇంట్లో సాయం చేయమని వాళ్ళమ్మ ఎంత బతిమిలాడినా పెడచెవిన పెట్టేది.
             కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు సడలింపునిచ్చి లాక్ డౌన్ విధించింది. శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, సభలు, సమావేశాలు  లేకపోవడంతో, పెళ్లిళ్లు కేవలం నలభై మందికే పరిమితం చేయడంతో, టెంట్ హౌస్ వ్యాపారం సన్నగిల్లింది. బాగా బతికిన కుటుంబం తిండిలేక ఇబ్బందుల పాలైంది. పరిస్థితిని ఆదిలోనే గమనించిన అన్నపూర్ణ ఎలాగైనా గడ్డు పరిస్థితిని ముందుచూపుతో ఎదుర్కోవాలని బాగా ఆలోచించగా, ఒక ఉపాయం తట్టింది. ఊర్లో కూరగాయలు పండించే రైతుల దగ్గరికి వెళ్లి వారి వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి, తమ టెంట్ హౌస్ ఆటోలో వేసుకొని భర్తతో కలిసి సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్లో ఉదయం ఆరు గంటల నుండి పది గంటలలోపు అమ్ముకొని ఇంటికి వచ్చేవారు.
             ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ టీవీ చూస్తూ బిజీగా ఉండేవారు. అన్నపూర్ణ వంట చేసేసరికి కడుపులో పేగులు నకనకలాడేవి. ఆకలితో ఉన్న పిల్లలు అమ్మా!, ఆకలి, ఇంకా ఎంతసేపు! అంటూ గోల చేసేవారు. కానీ ఇటున్న పుల్ల అటు పెట్టేవారు కాదు! మరునాడు తల్లిదండ్రులు మార్కెట్ వెళ్లగా టీవీ చూద్దాం అనుకుంటే కరెంట్ లేదు. ఫోన్లో ఆడుకుందాం అనుకుంటే ఫోన్ నాన్న తీసుకెళ్లాడు. పొద్దు పోక ఏం చేయాలో తోచక ఇల్లు పీకి పందిరేశారు. ఇంతలో వారికి వాళ్ళ అమ్మ రాసిన కథల కాపీ దొరికింది. బోర్ కొట్టకుండా ఉండడానికి ఆ కథలను చదవడం మొదలు పెట్టారు. ఆ కథలు చదువుతుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగినై! వాళ్ళు కథలన్నీ చదివేసరికి తమ తప్పు తెలిసొచ్చింది.!
            ఇంతలో అమ్మ, నాన్న ఆటోలో వచ్చారు. వంటపనిలో అమ్మకు ఇద్దరూ సాయం చేయడంతో వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది. మర్నాడు మార్కెట్ నుండి వచ్చేసరికి ఇంటి పని, వంట పని మొత్తం పూర్తి చేయడంతో ఆనందంతో తల్లిదండ్రులు, పిల్లల్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు.

                  ...