పస లేని పరీక్షలు (కథ): - ...గంగశ్రీ 9676305949

 శ్రీధర్: "శిరీషా, మీ రిజల్ట్స్ వచ్చేసాయంట కదా! గ్రేడ్ పాయింట్స్ ఎంత?"
వాళ్ల మామయ్య అలా అడిగే సరికి కదలని చెట్టులా మౌనంగా ఉండి పోయింది శిరీష.
శ్రీధర్: "ఏమైందమ్మా!,మాట్లాడవేంటి?"
మాధవి: "8 జిపిఎ అన్నయ్య, అందుకే అది డిసప్పాయింటయ్యింది."
శ్రీధర్: "అంటే 'బి  గ్రేడా?' అదేంటి మన శిరీష బాగానే చదువుతుంది కదా! పైగా నైన్త్ క్లాస్ లో నైంటీసిక్స్ పర్సెంట్ కదా?"
మాధవి: "అవునన్నయ్య; కానీ ఈ దిక్కుమాలిన కరోన ఏడ్చి చచ్చింది కదా! చదువు రానోళ్లకు, ప్రైవేటు స్కూల్ పిల్లలకు టెన్ జిపిఎ వస్తే, మన శిరీషకు యైట్ పాయింట్స్ మాత్రమే వచ్చాయి. నిన్నటి నుంచి ఏమి తినడంలేదు."
శ్రీధర్: "కరోనాతో చదువు రాని పిల్లలు సంతోష పడుతుంటే, చదువొచ్చిన వాళ్ళు యైట్ పాయింట్స్ తో సరి పెట్టుకోవాలా?"
మాధవి: మొదటి ఫార్మేటివ్ అసెస్మెంట్లో వచ్చిన మార్క్స్ మరియు అసైన్మెంట్స్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎస్ ఎస్ సి రిజల్ట్స్ ఇచ్చారంట!."
శ్రీధర్: "శిరీషా, ఏంటమ్మా నువ్వు పరీక్ష సరిగ్గా రాయలేదా?"
శిరీష: "చాలా బాగా రాశాను మామయ్య. కానీ, ఎందుకో మా టీచర్స్ తక్కువ మార్క్స్ వేశారు. పైగా అసైన్మెంట్స్ అన్నీ కూడా ఇన్ టైం లోనే సబ్మిట్ చేశాను. స్కూల్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు స్కూల్ కి క్రమం తప్పకుండా వెళ్లాను. అయినా ఎందుకిలా జరిగిందో!" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
మామయ్య శిరీషను దగ్గరగా తీసుకొని పోనీలే, బాధపడకు పరీక్షలైతే నీకు కచ్చితంగా టెన్ జిపిఎ వచ్చేది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రీ వాల్యుయేషన్ కి కూడా అవకాశం లేదు. బాధపడకు ఇంటర్మీడియట్ నీ సత్తా ఏంటో చూపించు. తెలివి ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వస్తాయెమో, కానీ వారిని ఎవరూ ఆపలేరు. జరిగిన దానిని గురించి బాధపడకు. ధైర్యంగా ఉండు, జరగబోయే దాని గురించి ఆలోచించు."
శిరీష: "సరే మావయ్యా, ఇంటర్లో నా సత్తా చూపిస్తా!, అమ్మా, ఆకలేస్తుంది అన్నం పెట్టు."
శ్రీధర్, మాధవి లు "గుడ్ గర్ల్, దట్స్ ద స్పిరిట్!" అంటూ డైనింగ్ లోకి నడిచారు.