అలకల చిలక (కథ):-.గంగశ్రీ-- 9676305949
  తన్వీ ఉదయం నుంచి లో ఓల్టేజీ బల్బులా నీరసించి ఉంది.!
ఏవైంది? అని ఎవ్వరడిగినా, నోటి గంటను మోగించడం లేదు. తనకిష్టమైన ఎగ్ పలావ్ చేసిచ్చినా, కడుపులో  పేగులు తినమని మెసేజ్ పంపినా, అటువైపు తలెత్తడం లేదు తన్వీ. ఏమైందోనని వాళ్ళమ్మ సుజాత గాబరాపడింది.
          తన సమస్యను వాళ్ళ నాన్న రఘునందనే, సులభ సూత్రాలు తెలిసిన గణిత మేధావిలా ఇట్టే పరిష్కరించగలడు !
అందుకే "అలకల చిలక" అని వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, ఆన్లైన్లో లేకపోవడంతో మిస్డ్ కాల్ ఇచ్చింది సుజాత. ట్రెజరీ ఆఫీసులో బిజీగా ఉన్న రఘు వాట్స్అప్ చేసినప్పుడు ఆన్లైన్లో లేకపోతే, సుజాత రింగిస్తుందని వెంటనే వాట్సప్ పెట్టెను తెరిచి, అధికారి అనుమతితో నాన్ స్టాప్ బస్సులా ఇంటికి బయలుదేరాడు.
వస్తూ వస్తూ, తన్వీకి ఇష్టమైన ఒక స్ట్రాబెర్రీ ప్యాక్ కొని, తన బ్యాగ్ లో దానికి కొంత చోటిచ్చాడు.
           నాన్న వచ్చిన అలికిడిని గమనించి తన్వీ గదిలోకి వెళ్లి తలుపేసుకుని విషాద గీతం మొదలు పెట్టింది.
రఘునందన్ చేప పిల్లలా ఫ్రెషప్ అయ్యి తలుపు తడితే గడసరి గడియ అడ్డుకుంది.!
        స్ఫటికం లోంచి సూర్య కిరణం వక్రీభవనం చెందినట్టు, తన దిశను  కిటికీ వైపు మళ్ళించాడు. స్ట్రాబెర్రీ పళ్ళను తన్వీకి చూపిస్తూ, తను ఒకటి నోట్లో వేసుకొని "అబ్బా! ఎంత బాగుందో!, చాలా బాగుంది.!" అనగానే. "నాకూ" అంటూ తన్వీ తను అలిగిన విషయం మరిచి లేడి పిల్లలా బయటకు వచ్చి, నాన్న దగ్గర నుంచి ఓ పండు లాక్కుని నోట్లో వేసుకుని, "నేను అలిగాను!" అంటూ, కోపంతో ఫ్లోర్ మీద తను పడేసిన చింత గింజలు లెక్క పెట్టసాగింది. "ముప్పై రెండు" అన్నాడు రఘు కాదు, "ముప్పై మూడు" అంది తన్వీ తటాలున.
అంతే రఘు ఒక్కసారిగా నవ్వడంతో, తన్వీ జత కలిపింది.
సుజాత ముక్కున వేలేసుకుంది.
           "ఇప్పుడు చెప్పమ్మా"! అంటూ తన్వీని తన కాళ్లపైన కూర్చోబెట్టుకుని అడిగాడు రఘు. అమ్మ ఫోన్ తెచ్చిచ్చి,
"ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పెడితే, ఒక్కరూ "లైక్" కొట్ట లేదంటూ.." బుగ్గల్ని గాలి బుడగలు చేసింది.!
"ఇంతేనా" అంటూ, ఆ పోస్ట్ ను తను "షేర్" చేస్తూ, కొంతమందిని టాగ్ చేశాడు. అంతే గంటలో వందల సంఖ్యలో "లైక్స్, కామెంట్స్" వచ్చాయి. "అలా ఎందుకంది?" హై ఓల్టేజీ బల్బులా వెలగుతూ.! ఎందుకంటే, నువ్వు ఫోన్ లో "డాటా ఆన్" చేయకుండానే "పోస్ట్" చేసావు!అనడంతో...
ముగ్గురు నవ్వుల ముగ్గులు వేశారు.

                ..