పుస్తకాల వినియోగం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి మొబైల్:9908554535.

 ఒక పుస్తకాల షాపుకు నలుగురు వ్యక్తులు పుస్తకాలు కొందామని వెళ్లారు .వారు తమకు నచ్చిన పుస్తకాలు కొని రోడ్డు వెంబడి నడుచుకుంటూ వస్తున్నారు .వారిలో మొదటి వ్యక్తి "ఈ పుస్తకాలు చదవడం  వల్ల విజ్ఞానం ,తెలివి పెరుగుతుంది "అని అన్నాడు." అవును "అన్నారు అందరు.
        రెండో వ్యక్తి మాట్లాడుతూ "ఈ పుస్తకాలను నేను ఇతరులకు చదవడానికి ఇస్తాను. పరోపకారం కొరకే నేను వీటిని కొన్నాను "అని అన్నాడు .ఆ మాట విని అందరూ అతనిని అభినందించారు .
         మూడవ వ్యక్తి మాట్లాడుతూ "ఈ పుస్తకాలు చదవడానికి నేను సంసిద్ధుడనై  కొన్ని పేజీలు చదివినంతనే నాకు నిద్ర వస్తుంది "అని అన్నాడు ."నాకు నిద్రకు ఉపయోగపడటానీకే నేను వీటిని కొన్నాను. ఇవి నిద్ర మాత్రల కన్నా నయం కదా!" అని అన్నాడు .అది విని అందరూ నవ్వారు .
         నాలుగో వ్యక్తి అది విని ఏమీ మాట్లాడలేదు . అప్పుడు మిగతా ముగ్గురు" నీవు ఎందుకు పుస్తకాలు కొన్నావో చెప్పనేలేదు .మౌనంగా ఉన్నావేమిటి "!అని అడిగారు .అప్పుడు వాడు "మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను ఒకే ఒక్క పెద్ద పుస్తకం కొన్నాను. అది నా తల కింద దిండు లాగా  పెట్టుకోవడానికి కొన్నాను తప్ప దానిని చదవడానికి కాదు. అందువల్ల తెలివి అన్నది నేను చదవకుండానే నా తల లోపలికి  దూరుతుంది" అని అన్నాడు. ఆ మూర్ఖుని మాటలకు  అందరూ విపరీతంగా నవ్వారు.
            అందుకే మూర్ఖులకు పుస్తక పఠనం విలువ తెలియదు.