లడ్డూల పంపకం:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి మొబైల్: 9908554535.

 ఒక మంటపంలో పంక్తి భోజనం నడుస్తున్నది.ఆ భోజనంలో కమ్మని నెయ్యి లడ్డూలను  తయారు చేశారు.  మురళయ్య  అనే వ్యక్తికి నిర్వాహకులు ఈ లడ్డూలు వేసే బాధ్యతను అప్పగించారు. అతడు ఒక్కొక్కరికి ఒక్క లడ్డూ మాత్రమే వేయాలనే నిబంధనను పెట్టారు. అతడు సరే అని    లడ్డూలు   తలా ఒకటి మాత్రమే విస్తర్లో వెయ్య సాగాడు .
       ఆ పంక్తిలో తన బావమరది  శంకరం కూర్చున్న సంగతిని మురళయ్య గమనించాడు. శంకరానికి లడ్డూలు అంటే   చాలా ఇష్టం. మురళయ్య తాను ఎలాగైనా అతనికి రెండు లడ్డూలు వేయాలనీ అనుకున్నాడు .అతనికి తాను అనుకున్న ప్రకారం రెండు లడ్డూలను వేశాడు. అప్పుడు శంకరం ప్రక్కనున్న వ్యక్తి రంగడు ఇది గమనించి "అయ్యో !మీ చేతికి ఏదో విషపు  పురుగండీ" అని అన్నాడు .
       ఆ మాట విని కంగారు పడ్డ మురళయ్య తన చేతిని జారవిడిచి "విషం పురుగు ఎక్కడ ?ఎక్కడ ?"అని చిందులు వేయ సాగాడు. ఈ కంగారులో అతని చేతిలో ఉన్న మూడు లడ్డూలు ఎగిరి  రంగని విస్తర్లో పడ్డాయి .మురళయ్య  రంగడు చెప్పింది అబద్ధమని గ్రహించి రంగడిని దూషించాడు .
         అప్పుడు రంగడు " అయ్యా!పురుగు లేదు.విషం లేదు. శంకరం  మీ బావమరిది అన్న సంగతి నాకు ముందే తెలుసు. మీరు అతనికి ఎక్కువ లడ్డూలు వేస్తారని నాకు తెలుసు . అందుకే నేను ఈ నాటకం ఆడాను "అని అన్నాడు .అది విన్న మిగతావారు మురళయ్యనే దూషించారు .
        .అందుకే బంధుప్రీతి కనబరచకుండా అందరిని సమానంగా చూడాలి.