బొద్దింక:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి మొబైల్: 9908554535.


  పట్నంలో ఉన్న దంపతులు ఒకసారి ఒక హోటల్ కి వెళ్ళారు. అది మాంసాహార  హోటల్. వారు చపాతీ, చికెన్ తెప్పించుకున్నారు .అందులో వారికి ఒక బొద్దింక  కనిపించింది .వారు హోటల్ సర్వర్ ను పిలిచి చీవాట్లు పెట్టారు .అతడు "నేనేం చేయాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందో !అయినా మాంసాహార హోటల్లో బొద్దింక వస్తే తప్పేమిటి "అని ఎదురు ప్రశ్నించాడు. ఇక వాడితో వేగలేక వారు శాకాహార హోటల్ కి వెళ్లారు.

       అక్కడ కూడా వారికి దురదృష్టవశాత్తూ వారు తెప్పించుకున్న టిఫిన్ లో బొద్దింక  కనిపించింది. అప్పుడు వారు" ఏమయ్యా! శాకాహార హోటల్ లో బొద్దింక వస్తుందా!" అని ప్రశ్నించారు. అప్పుడు హోటల్  వారు "ఏమండీ!   బొద్దింకకు శాకాహార హోటలో  మాంసాహార హోటలో తెలియదండీ! ఏదో  పొరపాటుగా పడి ఉండవచ్చు లేదా అది మాంసాహార హోటలు అనుకొని ఉండవచ్చు .అంతమాత్రాన ఇంత అల్లరి దేనికి ?"అని ఎదురు మాట్లాడారు .

        ఛీ !ఇక లాభం లేదని వారు మరొక హోటల్ కి వెళ్లారు .అది  శాకాహార ,మాంసాహార హోటల్ .అక్కడ కూడా  టిఫిన్లో  వారికి బొద్దింక కనిపించింది.అప్పుడు వారు " ఇది ఏంటయ్యా !పగబట్టినట్టు  ఏ హోటల్ కి వెళ్ళినా మాకు బొద్దింకనే  కనిపిస్తున్నది. అయినా మీరు చూడవద్దా!" అని అన్నాడు.

         అప్పుడు ఆ  హోటల్ వారు "చూడండీ!ఆ బొద్దింకకూ తాను  శాకాహారియో లేదా  మాంసాహారియో  అని అనుమానంగా ఉందేమో. మీరే ఆ విషయాన్ని  నిర్ణయిస్తారని కావచ్చు. లేదా మీరంటే దానికి చాలా ప్రేమ కావచ్చు. అందువల్లనే మీరు వెళ్లిన చోటల్లా అది మీతో పాటు ప్రతి  హోటల్ లో ప్రత్యక్షం అవుతూంది. కాబట్టి మీరు దానిని పట్టించుకోకుండా ప్రక్కన పెట్టి తినండి "  అని అన్నారు .ఆ దంపతులు ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు .

         అందుకే ఇంటి భోజనమే శ్రేష్టం అంటారు పెద్దలు.