మంత్రి తెలివి:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

ఒక రాజుగారు తన మంత్రితో నది ఒడ్డున పచార్లు చేస్తున్నాడు. మంత్రి ఆ నదిలోకి ఒక గులకరాయిని విసిరాడు . అది  మూడు చోట్ల ఎగిరి నాలుగవ దిక్కున పడింది .వెంటనే రెండవ గులక రాయిని విసిరాడు. అది కూడా అలాగే ఎగిరిపడింది .
  .     ఇది గమనించిన రాజు కూడా ఒక గులక రాయిని నీటిలోనికి విసిరాడు .అది కూడా మంత్రి విసరిన  రాయి లాగానే  మూడుసార్లు ఎగిరి నాల్గవ దిక్కున పడింది .వెంటనే రాజు మరొక రాయిని విసిరాడు. అది కూడా మొదటి రాయి లాగానే పడింది. మంత్రి వెంటనే నవ్వి "మహారాజా! మన ఇద్దరి రెండు రాళ్లు సమానంగా ఒకేలాగా పడ్డాయి "అని అన్నాడు .వెంటనే రాజు ఉగ్రుడై మరొక రాయిని విసిరాడు. " నేను నీ కన్నా ఒకటి ఎక్కువ విసిరాను .అంటే మూడు రాళ్లు  విసిరాను. నాదే పైచేయి" అని అన్నాడు. మంత్రి నవ్వి ఊరుకున్నాడు.
        ఇంతలో మంత్రి దూరం నుండి వస్తున్న జంతువు ని గమనించి "అదిగో ఒంటె వస్తుంది మహారాజా!" అని  అన్నాడు. వెంటనే మహారాజు "అది ఒంటె కాదు. ఏనుగు" అని అన్నాడు .మంత్రి వెంటనే "అవును!అది ఏనుగే" అని అన్నాడు  కానీ అది ఒంటె అని ఇద్దరికీ అర్థమైంది . మంత్రి  మాటనే పైచేయి అయిందని భావించిన రాజు మంత్రితో "నేను ఏనుగు అంటే నీవు ఏనుగు  అంటావా! మూర్ఖుడివా!" అని అన్నాడు.
" అయ్యా! మీ మాటనే మాకు శిరోధార్యం. మీ  అడుగు జాడల్లోనే  మేము నడుస్తాం. మీరు ఏది అంటే మేము అదే అంటాం అందుకే అది ఒంటె అయినా ఏనుగు అని  అన్నాను" అని అన్నాడు . రాజు మంత్రి సమాధానం  విని నవ్వి  "నీవు మూర్ఖుడవైన మంత్రివి. నీకు ఈ రోజు సన్మానం ఏర్పాటు చేస్తాను" అని అన్నాడు .
        మంత్రి "మహారాజా! మూర్ఖుడైన మంత్రికి సన్మానం చేసే రాజును కూడా ప్రజలు మూర్ఖుడు అనే  అంటారు. ఆ తర్వాత మీ ఇష్టం "అని అన్నాడు. రాజు
" అవును "అని తల ఊపి " అయితే సన్మానం రద్దు " అని అన్నాడు .మంత్రి "అమ్మయ్య "అని ఊపిరి పీల్చుకున్నాడు. 
     అందుకే మూర్ఖుల ముందు  తెలివిగా వ్యవహరిస్తే ఆపదల నుండి గట్టెక్కుతారు.