గర్వం:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

  ఆకాశంలోని నక్షత్రాలను చూసిన చంద్రునికి అహంకారం పెరిగింది .చంద్రుడు నక్షత్రాలతో "నేను ఒకే ఒక్కడిని లోకానికి చల్లని వెన్నెలను  ఇస్తాను .నన్ను చూసి  మానవులు ఆనందంతో  పండగ చేసుకుంటారు. పిల్లలు ఎంచక్కా నన్ను 'మామా' అని ముద్దుగా పిలుచుకుంటారు .కవులు, గాయకులు నా జపమే చేస్తారు. మరి మీరో! చిన్నగా మిణుకు మిణుకు మనుకుంటూ చాలా దూరంగా ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరూ తలవరు"  అని అన్నాడు .ఆ మాటలు విని నక్షత్రాలు చిన్నబుచ్చుకున్నాయి. 
         అవి తమకు పెద్ద దిక్కు అయిన  ఆకాశంతో చంద్రుడు అన్న మాటలను చెప్పాయి .ఆకాశం చంద్రుని  పిలిపించి" నీలో అహంకారం ఎక్కువైంది.  నీవు ఒక్కడివి కానే కావు .నీలాంటి వారు చాలా మంది ఉన్నారు. నీవు ఈ భూమికే ఒక్కడవు. పైగా నీవు స్వయం ప్రకాశకుడవు  కానే కావు .సూర్యుని సహకారంతో వెలుగును పంచుతున్నావు.  స్థిరమైన రూపం లేకుండా కళలు పెరిగి తరిగే నీవెక్కడ ? ఆ నక్షత్రాలు ఎక్కడ? చిన్న పిల్లలకు పెట్టే దిష్టి చుక్కలను చూసావా !అవి చుక్కలు కావా! పెండ్లి కొడుకులకు, పెళ్లి కూతుళ్లకూ బుగ్గపై పెట్టె చుక్కలను చూసావా! అవి చుక్కలు కావా! అందంగా ఉన్న వారిని చక్కని చుక్కలు అని అనరా! మానవులు మూడు నక్షత్రాలు, ఐదు నక్షత్రాలు గల హోటళ్లను నిర్మించారు. వాటిలో వారి పేరు లేదా? అవి స్వయంప్రకాశకాలు. అంతేగానీ నీలాగా సూర్యుని పై ఆధారపడినవి కావు. ఎంత దూరంలో ఉన్నా అవి ప్రకాశిస్తూనే ఉంటాయి. పెళ్లిలో అరుంధతీ నక్షత్రం చూపించనిదే ఆ పెళ్లికి అర్థం లేదే! ఇంత పేరు ప్రఖ్యాతి ఉన్న వాటి గురించి తక్కువ చేసి మాట్లాడతావా "అని కోపించాడు .అప్పుడు చుక్కలను దూషించినందుకు   చంద్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు .
       అందుకే ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు.