సమయ పాలన:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.

 గోపి బీదవాడు . అతనికి చదువుపై ఆసక్తి ఎక్కువ. ఉన్నత చదువులు చదవడానికి అతని వద్ద డబ్బు లేదు .కానీ ఎలాగైనా మంచి చదువులు చదివి ఉద్యోగం సంపాదించాలని అతడు  అనుకున్నాడు. ప్రక్క గ్రామంలోని శాంతయ్య దాన కర్ణుడు గా పేరుగాంచాడు .అతడు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని  చేసేవాడు. ఈ సంగతి తెలిసిన గోపి అతని  వద్దకు వెళ్లి తనకు ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సహాయం చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన శాంతయ్య నాకు రావలసిన డబ్బులు మీ గ్రామంలో వసూలు చేసుకొని రమ్మని మా వేణును  నీతో పంపుతున్నాను. మీరు ఇద్దరూ  రేపు ఉదయం 10 గంటలకు నా వద్దకు తిరిగి రమ్మని చెప్పాడు. గోపి సంతోషంతో తిరిగి వెళ్లి తన గ్రామంలోని వారందరికీ ఈ సంగతిని చెప్పాడు.
        మరుసటి రోజు గోపి నిద్రలేవలేదు .చివరికి వేణు తొందర పెడుతున్నా వినకుండా "వెళదాంలే "అని విసుక్కున్నాడు .వారు శాంతయ్య దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం  12:00 గంటలు  అయింది. శాంతయ్య  బయటకు వచ్చి "క్షమించాలి గోపి !నేను నిన్నటి రోజు నే నీకు నేడు ఉదయం  10 గంటలకు రమ్మని చెప్పాను. కానీ  నేను చెప్పిన సమయానికి నీవు రాలేదు .మరొక విద్యార్థి 9 గంటలకే ఇక్కడికి వచ్చాడు. అతనికి నేను ఆర్థిక సాయం చేశాను .అది ఒక జ్యోతిష్య పండితుడు నిర్ణయించిన మంచి ముహూర్తం .ఆ సమయంలోనే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని అనుకున్నాను. అయినా సమయపాలన పాటించని నీవు ఇక ముందు చదువుకు ఎలా ప్రాధాన్యమిస్తావో నాకు అంతు పట్టడం లేదు. నీలాంటి వారికి సహాయం చేస్తే అది అపాత్రదానమే . అందువల్ల నేను నీకు సహాయం చేయలేను "అని అన్నాడు.
        అప్పుడు గోపి "అది  కాదండీ! నేను మీ గురించి అందరికీ చెప్పేసరికి  ఆలస్యం అయింది "అని అన్నాడు. " నా గురించి చెప్పమని నేను ఎప్పుడూ నీతోని  చెప్పలేదే! నీవు సమయపాలన పాటించడం లేదు అనడానికి నీ వెంబడి వచ్చిన ఈ వేణుయే   ప్రత్యక్ష సాక్షి.  నిన్ననే నీ గురించి, నీ బద్ధకం గురించి అన్ని వివరాలు సేకరించి వేణు నాకు తెలియజేశాడు .కావున నీవు ఇకనైనా నీ పద్ధతి మార్చుకొని సమయపాలనను పాటిస్తావని నేను అనుకుంటున్నాను "అని అన్నాడు శాంతయ్య. అప్పుడు గోపికి తన వెంబడి వేణుని శాంతయ్య ఎందుకు పంపించాడో అర్థమైంది .తాను సమయపాలన  పాటించక ఆర్థిక సహాయం పోగొట్టుకున్నందుకు గోపి మిక్కిలి చింతించాడు.
        అందుకే సమయపాలన పాటించడం పిల్లలు అలవర్చుకోవాలి.