మన భాష తెలుగు --తెలుసుకుంటే వెలుగు తెలుగు ఒడిలో...9 --గడ్డిపూలు:-రాజావాసిరెడ్డి మల్లీశ్వరి

 కాగితపు పూలకన్న గరికపూలు మేలు – అని అంటారు కదా. గరిక పూలు అంటే గడ్డిపూలు మన చుట్టూ ఉండే వివిధ వర్ణాల – రకాల పూలు మనని మెప్పిస్తాయి.  ముచ్చట గొలుపుతాయి వాటికన్నా భిన్నమైన వాసన లేకుండా ఉన్న గడ్డిపూలవైపు చూడనీవు.
ఆకారంలో, సువాసన నివ్వటంలో, అందంలో మిగిలిన పూలకన్నా గరికపూలు భిన్నమైనవి. తన చేత అలంకరించుకోని దేవుణ్ణి చూసి – నేనంటే ఇంత చిన్న చూపా ప్రభూ – అని గడ్డిపూవు అడిగిందనేదొక చమత్కృతి. 
నిజమే మరి. చిన్న చిన్న తెల్లతెల్లని పూలతో మన కాళ్ళ కింద ఒదిగిపోయే పచ్చని గడ్డి తివాసి పరచినట్లుంటుంది. గడ్డిని తొక్కుతూ పోయే జనం ఆ గడ్డిపూల అందాన్ని గమనించరు. ఆ అందాన్ని చిన్న చూపు చూస్తారు.  కానీ ఆ గడ్డి పూలే ప్రకృతి కాంతకు ఆందాన్ని, శోభను ఇస్తాయి. 
అర్జునము, తృణము, పచ్చిక, ‘మృగ’ప్రియము మొదలగు ఎన్నో పేర్లతో పిలువబడే గరిక ఱెల్లు గడ్డి, గ్రుడ్డి కామంచి, వసంత గంధము, మెఱుగు గడ్డి మొదలైన ఎన్నో గడ్డి విశేషాలున్నాయి. వెదురు, చెఱుకు కూడా గడ్డి జాతికి చెందినవే. వీటన్నిటిలో నదీతీరాలలో సన్నగా ఏపుగా పెరిగే రెల్లుగడ్డి పూలు తెల్లగా, చిన్నచిన్నగా, గుత్తులు గుత్తులుగా పూస్తూ ఎంతో అందాన్ని ఒలికిస్తాయి. వెండి రజనులా తెల్లగా పరచుకున్న వెన్నెల్లో, ప్రశాంత నదీతీరాన ఈ రెల్లుపూలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేము గాలికి అటూ ఇటూ ఊగుతూ కళ్ళు మళ్ళించనీయవు.
“గడ్డిపూవును ప్రభూ!
నీ దరికి రాలేను – నీకు పూజ చేద్దామంటే”-
అంటూ కవులు కవితలు రాశారు.
ఏది ఏమైనా స్వేచ్ఛ, స్వచ్ఛత, నిరాడంబరత, అందం, అణకువ , ఆనందం నేలమీద నక్షత్రాల్లా మెరిసే గడ్డి పూవు సొంతం. తుఫానుకు భయపడక తలవంచి సాగిలపడినా సంయమనంతో తనను తాను, నిలబెట్టుకునే నేర్పరులీ గడ్డి, గడ్డిపూలు.  మరి గడ్డిపూలను చూచి వాటి లక్షణాలను మనం నేర్చేదెన్నడు?