నెమలి అహం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 ఒక అడవిలో  ఓ నెమలి ఉండేది. అది బాగా నాట్యం చేసేది.  అడవిలోని జంతువులు, పక్షులు దాని నృత్యం  చూసి ఆనందించేవి. దీనితో దానికి అహం పెరిగింది. ఎవరిని లెక్క చేసేది కాదు. తానే గొప్ప అనుకునేది. దగ్గరలోని చెట్టుమీద ఓ కోకిల ఉండేది. అది మధురంగా పాడేది. దాని పాటకు తోటి పక్షులు, జంతువులు పరవసించిపోయేవి. అయినా దానికి ఏ మాత్రం గర్వం లేదు. ఒకరోజు నెమలి,  కోకిల వద్దకు వచ్చింది. "కోకిలా!  మనకు పాడటం, నృత్యం చేయటం దేవుడిచ్చిన గొప్పవరం. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి. అందరిలో కలవకూడదు. అందరూ వచ్చి మనల్ని పొగడాలి" అంది. 
        కోకిల నవ్వి ఊరుకుంది.  దాని మాటలలేవి పట్టించుకోలేదు. ఎప్పటిలాగే అవి రెండు దేని బాణీలో అవి వుండసాగాయి. కొన్నాళ్లకు ముసలవయ్యాయి. నెమలి నాట్యం చేయలేక పోతుంది. కోకిల పాడలేకపోతుంది. నెమలిని తోటి పక్షులు జంతులు చీదరించుకున్నాయి. దాన్ని పట్టించుకోవడమే మానేశాయి.  కోకిలను మాత్రం మునుపటి లాగానే ఆదరంగా చూశాయి.