అరుగు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 తమ్ముడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికి రమ్మని నాలుగు రోజులు ముందే ఫోన్ చేసి చెప్పాడు. పిల్లలిద్దరూ ఎప్పుడు ఎప్పుడు వెళదామా అని ఆరాటపడుతున్నారు. ఈమధ్య పిల్లల చదువు తో పుట్టింటికి వెళ్లడం కుదరటంలేదు. ఎలాగూ గృహప్రవేశం కదా అని నలుగురం బయలుదేరాం. తెల్లవారుజామున ముహూర్తం. సాయంత్రం రాగానే కొత్త ఇల్లు చూద్దామన్నారు. రాగానే అక్కడ ఉన్న అరుగు ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది త్వరగా వెళ్లి అరుగు మీద కూర్చున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి నా మనసులో మెదిలాయి. పూర్వం నా చిన్నప్పుడు అది పెంకుటిల్లు. చుట్టూరా ఖాళీ స్థలం. వెనకాల పెరటిలో పెద్ద బాదం చెట్టు ఉండేది. కాయలని కోసి పప్పులు కొట్టి ఇ తమ్ముళ్ళు చెల్లెళ్ళు పంచుకునే వాళ్ళం. అక్కడే పెద్ద రాతి అరుగు ఉండేది. సాయంత్రం కాగానే పిల్లలమంతా అరుగు మీద కూర్చుని పాఠాలు చదువుకునే వాళ్ళం. ఎదురుగా అవిస చెట్లు ఉండేవి వాటిమీద కోయిల పిల్లలు అరుస్తూ కూర్చునే వి. ఆ రోజుల్లో కరెంటు ఉండేది కాదు. కిరసనాయిలు లాంతర్లు వెలిగించేవారు. చీకటి పడకముందే అమ్మ పిల్లలందరినీ అరుగుమీద వరుసగా కూర్చోబెట్టి కంచాలు పెట్టి అన్నం వడ్డించేది. కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తినే వాళ్ళం. వేసవికాలంలో అరుగుమీద ఇద్దరూ పడుకునేటందుకు వీలుగా ఉండేది. నేనంటే నేనని మాట్లాడుకునే వాళ్ళం. అట్లతద్దె వస్తే చాలు అరుగు మీదనే వెన్నెలలో పెరుగన్నం కలిపి అమ్మ ముద్దలు చేసి పెట్టేది. ఇప్పటికీ ఆ అరుగు అంటే నాకెంతో ఇష్టం. ఇప్పుడు పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టారు. అరుగు ని మాత్రం మర్చిపోలేదు. కానీ దాని స్థానం మార్చారు. ఏమైతేనేమి మళ్లీ అరుగు వచ్చింది. మరునాడు గృహప్రవేశం కాగానే తీరుబడిగా అరుగు మీద కూర్చుని పూలు మాలలు కట్టడం మొదలు పెట్టాను. ఈ కాలంలో లో అన్ని అపార్ట్మెంట్ లే కదా. ఎక్కడైనా ఇండివిడ్యువల్ హౌస్ లు ఉంటే జానెడు స్థలం కూడా వదలడం లేదు. చిన్న గది లాగా కట్టి షాపులకు ఇస్తున్నారు. ఇంకా ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి తీరుబడిగా కూర్చుని మాట్లాడుకోవడానికి. అత్త నీకోసం మా నాన్న ఈ అరుగు కట్టించాడు. నీకు చిన్నప్పుడు అరగంటే ఇష్టంట కదా అని చెప్పింది మేనకోడలు. నిజమే నాకు అరుగు అంటే చాలా ఇష్టం. ఈ అరుగుతో ఉన్న సంబంధం ఇంతా అంతా కాదు. ఎన్ని జ్ఞాపకాలు పంచు కొన్నాము. అలాగే విషాదాన్ని కూడా చవి చూసాము. నీరజ నా వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అత్త అన్నది. నా చిన్నతనంలో ఒక తమ్ముడు పుట్టాడు. ఎర్రగా చాలా అందంగా ఉండేవాడు. వాడికి విపరీతంగా జ్వరం వచ్చింది. అప్పుడు మా నాన్న ఊర్లో లేడు. పక్కనున్న ముస్లిం తాత వచ్చి మంత్రం వేశాడు. అల్లాన్ని తలుచుకుంటూ ఏవేవో చదివాడు అయినా లాభం లేదు. పిల్లవాడిని వెంటనే అరుగు మీద కి తెచ్చి పడుకో  పెట్టమన్నాడు.
అంతే కాసేపట్లో ఎగిరిపడి ప్రాణం పోయింది. చూస్తూ ఉండగానే అరుగు మీదనే పాపం పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. అలా జరిగింది అని బాధపడ్డాను. జరిగిన దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం. అనే హోదా వచ్చింది. అక్కడ ఉన్న నాలుగు రోజులు అరుగు మీదనే కూర్చుని గడిపేదాన్ని ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఒక అరుగును కూడా కట్టించుకోవాలి అని నిశ్చయించుకున్నాను..