మురికి వదిలింది--:ద్వారపురెడ్డి. జయరాం నాయుడు. కైకలూరు, కృష్ణా జిల్లా

 నాన్న వారం రోజుల ఆఫీస్ టూర్ ముగించుకొని ఇంటికి రాగానే రవి పరుగుపరుగున వెళ్లి నాన్నను చుట్టుకుపోయి ఏడుపు మొదలెట్టాడు.
  "ఎందుకు నాన్నా!ఏడుస్తున్నావు?నిన్ను ఎవరేమన్నారు"అని వాళ్ళ నాన్న అడిగేసరికి రవి వాళ్ల అమ్మ మీద ఒకటే ఫిర్యాదులు.
   అమ్మ కొట్టింది.అమ్మకు నేనంటే ప్రేమ లేదు.అంటూ ఏడుస్తూ చెప్పాడు.
    భార్యను పిలిచి "ఏమయ్యింది" అని అడిగాడు."పొద్దస్తమానం సెల్ ఫోన్ లో వీడియోగేమ్స్ ఆడడం,టివిలో కార్టూన్ సీరియల్స్ చూడడం తప్ప వీడికి ఇంకో ప్రపంచం లేదు.ఎన్ని మంచిమాటలు చెప్పినా పెడచెవిన పెడుతున్నాడు.చదువు లేదు,హోమ్ వర్క్ చేయడం లేదు.చెప్పి చెప్పి విసిగిపోయి రెండు దెబ్బలు వేశా".అంది భార్య.      
    "రవిని సముదాయించడానికి"అయితే కొట్టేస్తావా?"అన్నాడు మందలిస్తున్నట్టుగా.
       రవిని ఒక రోజు చెరువు గట్టుకు తీసుకువెళ్ళాడు వాళ్ళ నాన్న.అక్కడ బండమీద కొంతమంది బట్టలను గట్టిగా బాదుతూ ఉతకడం కనిపించింది.
    "అంత గట్టిగా బట్టలను రాయికేసి బాదితే చిరిగి పోవా నాన్నా!"అని రవి అడిగాడు.
  "చిరిగిపోతాయి అని వాటిని అలా ఉతకకపోతే అవి వాడడానికి పనికిరాకుండా కంపుగొట్టి పాడైపోతాయి.దుస్తులకు పట్టిన మురికి,క్రిములు వదలాలంటే ఆ మాత్రం దెబ్బలు వేయక తప్పదు.అలా చేయకపోతే వాటికి పట్టిన మురికిభూతం వదలదు మరి.
   అలాగే నీ పట్ల మీ అమ్మ చేసినది కూడా సబబే.నీకున్న సరికాని అలవాట్లను వదిలించడానికి, నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి అలా దండించింది. అంతే కానీ నీ మీద ప్రేమ,ఇష్టం లేక కాదు.నువ్వంటే మీ అమ్మకు పంచప్రాణాలు".అన్నాడు నాన్న.
    రవికి ఇప్పుడు అమ్మ తనను ఎందుకు కోప్పడి కొట్టిందో బాగా అర్థమయ్యింది.
    అప్పటి నుంచి రవి అమ్మ కోప్పడే అవసరమే లేకుండా చక్కగా చదువుకుంటూ తనపని తాను చేసుకుంటూ  బుద్ధిగా ఉండసాగాడు.

కామెంట్‌లు