మంచివారికి మంది అండ ఉంటుంది (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  ఓ అడవిలో కోతి ఉండేది. అది  కిరాణా కొట్టు పెట్టింది.  న్యాయంగా అమ్మేతే లాభం రావడంలేదు. ఒక్క సారిగా కోటీశ్వరుడు కావాలనేది ఆ కోతి కోరిక. అందుకై అధర్మ వ్యాపారం చేయటం ప్రారంభించింది. సరుకులలో కల్తీ చేసేది. తూకంలో వ్యత్యాసం చూపేది. దీంతో  కొనుగోలు చేసే జంతువులు, పక్షులు  విసిగి వేసారి పోయాయి. "ఎవరైనా కొత్త వారు వచ్చి కొట్టు పెడితే బాగుండు"  అని ఎదురు చూడ సాగాయి.
   అదే సమయంలో ఓ కుందేలు, కోతి కొట్టు ప్రక్కనే మరో కొట్టు పెట్టింది. న్యాయంగా, ధర్మంగా  అమ్మకం చేస్తుంది. ఇదిగిట్టని కోతి అగ్గిమీద గుగ్గిలం అయింది. కుందేలుపైకి గుడ్ల గూబలను, గబ్బిలాలను పంపి కొట్టించింది. కొట్టును ధ్వంసం చేయించింది. పాపం కుందేలు చేసేదిలేక మౌనంగా ఉండి పోయింది. ఈ విషయం తెలుసుకున్న  జంతువులు, పక్షులు కోతి మీద దాడి చేశాయి. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాయి. కోతి కొట్టును వదిలిపెట్టి బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది. ఎటుపోయిందో ఏమో ఇప్పటికి తిరిగి రాలేదు.  మంచి వారికి ఎల్లప్పుడూ మంది అండ ఉంటుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదూ.
కామెంట్‌లు