మిన్న-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కాంతులీను కనకనగము కన్న
మాయింటి చిన్నారి
చిలిపి చిరునగవు మిన్న
వెలలేని రత్నరాసుల కన్న
మాయింటి చిన్నారి
తేనెలోముంచిన మాట మిన్న
ఘనమైన సురలోకపదవి కన్న
మాయింటి చిన్నారి
ప్రేమైక పరిష్వంగము మిన్న
నాకలోకపు నాట్యకత్తెల నాట్యము కన్న
మాయింటి చిన్నారి
బుడిబుడి అడుగుల చిందులు మిన్న
ఘనకీర్తి గాయకుల గానము కన్న
మాయింటి చిన్నారి
అల్లరి లొల్లాయి పాటలే మిన్న
చిన్నారి మాకంటి దీపలక్ష్మి
చిన్నారి మాయింటి శ్రీమహాలక్ష్మి
చిన్నారి ఆయింటి కాబోవు గృహలక్ష్మి!!