*వస్తారా?*:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాలల్లారా రారండి - 
బాగా అల్లరి చేద్దాము
బాలల్లారా రారండి - 
బుద్ధికి పదును పెడదాము
!!బాలల్లారా!!

బస్సు ఎక్కీ వస్తారా? - 
బాలల పండుగ చేద్దాము
ఆటో ఎక్కీ వస్తారా? - 
ఆటలు ఎన్నో ఆడుదము
పడవ ఎక్కీ వస్తారా? - 
పాటలు ఎన్నో పాడుదము
కారు ఎక్కీ వస్తారా? - 
కథలు ఎన్నో విందాము
వ్యాను ఎక్కీ వస్తారా? - 
వానలొతడిసి తిరుగుదము
!!బాలల్లారా!!

రథము ఎక్కీ వస్తారా? - 
రాజుగారి తోటకు వెళదాము
బండి ఎక్కీ వస్తారా? - 
బంతి పూవులు కోద్దాము
గుర్రము ఎక్కీ వస్తారా? - 
గుడికి మనము వెళదాము
స్కూటరు ఎక్కీ వస్తారా? - 
స్కూలుకు మనము వెళదాము
లారీ ఎక్కీ వస్తారా? - 
లెక్కలు అన్నీ చేద్దాము
!!బాలల్లారా!!

ఏనుగు ఎక్కీ వస్తారా? - 
ఎక్కడికైనా వెళదాము
జట్కా ఎక్కీ వస్తారా? - 
జూకు వెళ్ళి చూద్దాము
రైలు ఎక్కీ వస్తారా? - 
రైతుల పనులు చూద్దాము
సైకిలు ఎక్కీ వస్తారా? - 
సైనికుల కవాతు చూద్దాము
స్టీమరు ఎక్కీ వస్తారా? - 
స్టీలు ఫ్యాక్టరి చూద్దాము
!!బాలల్లారా!!
 

కామెంట్‌లు