మనిషి-మనుగడ:--డా.పి.వి.ఎల్.సుబ్బారావు
 *పల్లవి*
జీవంటే ఈ మనిషి ఒక్కడేనా!
       లక్షలాది జీవులెన్నో లేవా!
ఆ జీవుల బతుకు రగడైతే!
   ఈ మనిషి మనుగడ ఎలా!
*చరణం 1*
వనాల్లో ఉండేది సరి
        ‌               జీవనచక్రమే!
జనాలు వేటతో అది ఛేదిస్తే
                        అక్రమమే!
మనిషి క్రూరత్వమే,
        క్రూరమృగాల సంచారమై,
అవి ఆహారం కై జనాలపై
           పడడం సహజమే!
*చరణం 2* 
ఎన్నో జీవజాతులు కనుమరుగై
ఎంతగానో ప్రకృతి సమతుల్యం
                             భంగమై,
మనిషి స్వార్థమే సకల
               అనర్థాల మూలమై,
నాగరికత పేరిట  నాశనం
               విశ్వవ్యాప్తమే!
*చరణం 3*
ఓ బుద్ధి జీవా! దుర్బుద్ధి దూరం
                              కావాలి!
ప్రకృతి తో నిత్యం సహజీవనం
                            చేయాలి!
నిర్మలమైన నదుల్లో
          జలచరాలు జీవించాలి!
స్వచ్ఛమైన గాలుల్లో
          భూచరాలు బతకాలి!
*చరణం 4*
మానవ జాతి మహాలక్ష్యం
              శాంతి స్థాపనం!
మానవ జాతి మహాధర్మం
             అహింస పాలనం!
మానవ కల్యాణం లో
తరువులు,జంతువులే మూలం!
 తరువులు నరకడం,
  జంతువులు చంపడం
                         మహానేరం!
*చరణం 5*
 జీవకోటి సౌభాగ్యం,
   పర్యావరణ దినోత్సవ లక్ష్యం!
సాటి జీవుల పరిరక్షణే,
    మన ప్రథమ కర్తవ్యం!