చెల్లె పుట్టిన వేళ..:--దోర్బల బాలశేఖర శర్మ


 నా జీవితంలోని అతిపాత జ్ఞాపకం ఇదే. నాన్నకు మేం నలుగురం మగ పిల్లలం వున్నా ఒక్కగానొక్క చెల్లె (శ్రీమతి సుశీలమ్మ) అంటే ఎందుకంత ప్రేమో నాకు మొదట్లో తెలియలేదు. తర్వాత తెలిసి వచ్చాక, 'నిజమే' అనిపించింది, 'ఆడపిల్లలపట్ల అంత మమకారం ఉండాల్సిందేనని'! నా పెద్ద కొడుకు లౌకిక్ కు కిందటి సంవత్సరం (2020 మే 30) ఇంచుమించు ఇదే సమయానికి  మా ఏడాది పాప (నిహిర) పుట్టిన వేళకూడా దాదాపు ఇలాంటిదే. అనారోగ్యంతో మా అమ్మ ప్రాణం (ఆత్మ) మమ్మల్ని వదిలి వెళ్లలేక వెళ్లి (2006లో) చివరకు నా ఇంటి పెద్ద కోడలమ్మ (మౌనిక) కడుపున ఇలా మళ్లీ పుట్టి ఉంటుందన్న భావనే నిజమైతే, మా ఆనందం అంతకు వెయ్యిరెట్లు ఎక్కువ. 'స్వచ్ఛమైన ప్రేమ, మమతానురాగాలకు ఆడపిల్లలు నిలువెత్తు రూపాలు' అన్న జీవితసత్యానికి మూలమైన ఈ రెండు సంఘటనలను నేనెప్పటికీ మరిచిపోలేను.

నాకప్పుడు అరేళ్లకు మించి ఉండవు. ఇది సుమారు 54 ఏండ్ల కిందటి విషయం. "మీకు చెల్లె పుట్టింది. లేవండి" అంటూ నాన్న, మమ్మల్ని (అన్న, నేను, తమ్ముడు) నిద్ర లేపిన సందర్భం నాకిప్పటికీ గుర్తు. సమయం సరిగ్గా గుర్తు లేదు. రామాయంపేటలోని చతుషాల, ఉత్తర వరండా, చివరి గదిలో పడుకున్న మమ్మల్ని ఆ రోజు నాన్న పొద్దున్నే లేపి, చెప్పిన మాటలివి. పక్కగది దివాన్ ఖానలోనే చెల్లె పుట్టింది. ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల. అందులో, అన్న కన్నా ముందు, ఒక ఆడపిల్ల తొలుసూరు కాన్పుగా పుట్టకుండానే చనిపోయిన కారణంగా, ఆ బాధను మరిపింప చేసిన ఘటన ఇది. చెల్లెపట్ల నాన్నలోని ఆనందం అలా పెరుగుతూ వచ్చిందే తప్ప, ఏనాడూ తగ్గలేదు. తెలిసో తెలియకో ఏదైనా అల్లరి చేస్తే నాన్న మమ్మల్ని తిట్టేవారే కానీ, చెల్లెను కోప్పడిన సందర్భం నేను చూడలేదు. 'చుచ్చమ్మా!' అన్న ముద్దు పేరుతోనే ఎప్పుడూ మనసారా పిలిచేవారు. ఒక తండ్రి తన ఆడబిడ్డను ఎంత అపురూపంగా, ప్రేమగా, హృదయం నిండుగా చూసుకోవాలో నేను ఆయన ద్వారానే తెలుసుకున్నాను.