బాపంటే బలం
బాపంటే బాంధవ్యం !
గుండెలోతుల్లో ప్రేమంతా
గుంభనంగా దాచుకునే నాన్న
గారాబాల సరాగాలు పాడకున్నా
గాఢ అనుభూతుల
పొరలన్నీ కనుపాపల్లో నిక్షిప్తం చేసి
నే నడిచే దారిల పరిచే నాన్నను
‘నేను’ ఆయన’ ను కలిపి
‘నాయన’,’నాన్న’అయ్యిండని అంటా!
రేపటి దిశానిర్దేశపు వర్తమానమై
వేలుబట్టి దిద్దించు బాపు అంటేనే బంధం!
ఎదలోని ఆత్రుతను
ఏమరుపాటు లేనితనంతో జతచేస్తే
నిండైన నిలువెత్తు విగ్రహంలా
కొండంత రూపుతో
మదినంత పరుచుకొను
బాపు అందమైన భావనా బలం!
ఎవరి జీవితాన్నైనా కన్నీటిలోనే గాదు
చెమట చుక్కల పరిమళాల్ని ప్రేమగా అందించి
చనువుగా చూపించే కన్నతండ్రి
వెలుగు చూడని నాయకుడే!
మా బాపు కోటి కాంతుల ప్రచండ సూర్యుడై,
మనోకుడ్యానికి
మనహర చిత్రపటంలా వ్రేళాడు
బాపు అంటేనే బలం !
బాపు అంటేనే బాంధవ్యం !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి