కోపం...అచ్యుతుని రాజ్యశ్రీ

 కరోనా కారణంగా పిల్లలు గోలగా అరుస్తూ తోచకుండా చేస్తుంటే అమ్మ బాలకి శివాకి  రెండు తగిలించింది వీపుపై.ఇద్దరు ఆరు ఏడేళ్ల వయసువారు.శివా  చిన్న పిల్లాడు అని అమ్మ కాస్త ముద్దు చేయటం బాలకినచ్చదు. నాన్న మాత్రం  బంగారుతల్లి  అని గారం చేస్తాడు.అది శివాకి నచ్చదు. అందుకే ఇప్పుడు చిన్న  చిన్న విషయాలకే గొడవపడుతారు. ఇద్దరు టి.వి.కి అతుక్కుపోయి  ఛానల్స్ మార్చటంలో గొడవ  చివరికి రగడగా మారుతుంది. అమ్మా నాన్న కి దిక్కుతోచటం లేదు. అందుకే  అందరినీతీసుకుని కారులో తమ పల్లెకు బైలుదేరాడు.రెండు గంటల ప్రయాణం భలే సరదాగా ఉంది పిల్లలకి. అమ్మా నాన్న ఆలోచన లో మునిగారు.పిల్లలకి ఊహ వచ్చాక తమ పల్లె కి తీసికెళ్ళ లేదు. వేసవిలో కూడా సమ్మర్ కాంప్ లో చేర్చేవారు. కరోనా వల్ల  శరీరం తో పాటు  మనసు అలసి కొట్లాటలతో గడబిడ చేస్తున్నారు పిల్లలు.కారు ఆ డాబా ఇంటి ముందు ఆగటంఆలస్యం అమ్మమ్మ  తాత మామ అత్త  వారి పిల్లలు  సాయి లలిత  వాకిట్లో నించుని  ఆనందంగా పలకరించడం  వింతగా అనిపించింది బాల శివా కి. హాయ్ బై అనే తమ అపార్ట్మెంట్ పిలుపులే వారికి తెలుసు. చుట్టూ చెట్లు  కూరగాయల మడులు!ఒక అరగంటకల్లా పిల్లలు చనువుఏర్పడి ఆడుతూ ఉండిపోయారు. ఆసాయంత్రం పొలం వైపు  అంతా షికారు కెళ్ళారు.రెండు రోజులు బానే ఉన్నా  బాల శివా  చిన్నగా సణుగుతూ దెబ్బలాట ప్రారంభించారు. తన కలర్ బాక్స్ ఇవ్వను అంది బాల.అంతే ఆరున్నొక్క రాగం ఆరంభించిన వారిని ఊరుకోబెట్టే ప్రయత్నం చేసిన అమ్మ  ఓడిపోయి వీపుపై దరువేసింది.మామ తాత  కారణం తెలుసుకుని "బాలా!నీవు పూలు కోయి.శివా  నీవు  సాయి ఆవులకి గడ్డి వేసి రండి"అని పంపారు. అంతే పావుగంట తర్వాత  నలుగురు పిల్లలు కిలకిల లాడటం వినపడింది. తాత అన్నాడు"పిల్లల కి కోపం వస్తే  తిట్టి కొడితే మొండి గా మారుతారు.వారికి వేరే పనులు  చెప్పి చేయించాలి.చల్లగాలిలో ఆడమనాలి." సిటీలో కుదరదు  అన్న కూతురుతో "పిల్లలని ఓవారం ఇక్కడే వదిలేయి.నలుగురితో  కలిసి పోటం నేర్చుకుంటారు.పాటలు శ్లోకాలు సాయి బాగా  పాడుతాడు.పాప ఎంచక్కా ముగ్గులు నేర్పుతుంది. పూల దండలు గుచ్చటం నేర్పుతుంది. "సరే నని తలూపి  అమ్మా నాన్న  కారు ఎక్కితే "మేము రాము.నెల తర్వాత  వీరందరినీ  తీసుకుని  మేము  వస్తాము"అన్న బాల శివా  వైపు  అంతా  ఆనందం గా చూశారు.
కామెంట్‌లు