లోపం....అచ్యుతుని రాజ్యశ్రీ


 ఆక్లాసులో కొత్త గా చేరాడు రవి.బొద్దుగా మంచి రంగు తోఅందంగా ఉన్న ఆకుర్రాడు అందరినీ ఇట్టే ఆకర్షించాడు.అంతా  "ఇలా  నాపక్కన కూచో..ఉహు. నాదగ్గర కూచో" అంటూ తమప్రక్క కూచోమని  బతిమలాడినా  రవి అదేమి వినిపించుకోకుండా  నల్లబల్ల దగ్గర ఓ డెస్క్ చిన్న కుర్చీలో  కూచున్నాడు. ఇంతలో మాష్టారు వచ్చారు. పుస్తకంలో  మునిగిన రవి ఆయన రావటం గమనించలేదు. ఎవరిదోచేయి భుజం పై పడటంతో ఉలిక్కిపడి లేచాడు. "నీవేనా  ఈరోజు చేరిన కొత్త కుర్రాడివి?"మాష్టారి ప్రశ్నకు ఔను అన్నట్లు తల ఊపాడు. "నీ పేరు?" "ర..ర .వి.."ఆకుర్రాడికి నత్తి ఉన్నట్లు  గమనించారు. పిల్లలు  గుసగులాడుకున్నారు. రవి వంచిన తల ఎత్తలేదు. మాష్టారు  క్లాసులీడరు తో అన్నారు  "ప్రసాద్!ఈ కొత్త కుర్రాడి కి ఏసహాయం కావాలి అన్నా చెయ్యి. పిల్లలూ!మీరంతా  అతని బెరుకు పోగొట్టాలి. మనం  దేవుడు ఇచ్చిన అవయవాలు బుద్ధిని సరిగ్గా వినియోగించాలి.ఇతరులకు అవసరమైన సాయం చేయాలి"అని పాఠంలోకి ప్రవేశించారు.  ఓ వారంగడిచినా రవి నోరు విప్పి  మాట్లాడటంలేదు. అతనికి విపరీతమైన నత్తి. తండ్రి లేడు.అమ్మ  ఇళ్లల్లో  పని చేస్తుంది.  కానీ  నారాయణ సార్  రోజూ తన క్లాసులో  తెలుగు పదాలు పాఠం పద్యాలు  చదివిస్తూ మిగతా పిల్లలతో చదివించటంతో రవిలో జంకు తగ్గింది. అందరు టీచర్ల వలన తన పొందికైన గుండ్రని రాతతో మంచి మార్కులు  సంపాదించే రవి అంటే పిల్లలు అభిమానం  చూపుతు నత్తిని వేలెత్తి చూపటం లేదు.  మనం  ఏదైనా  లోపం ఉంటే  బాధ పడకుండా  లోపం సరిదిద్దుకోవడం కై యత్నించాలి.