నేడు కష్టపడితే రేపు సుఖం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

కోడి, కోతి ఓ రోజు షికారుకు బయలుదేరాయి. మార్గ మధ్యలో  వాటికి   ఓ మూట కనిపించింది. విప్పిచూస్తే   అందులో జొన్నలు ఉన్నాయి.  కోతి వాటిని తినబోయింది. "కోతి మిత్రమా! అగాగు. వీటిని తినకు. వీటిని మన పొలంలో నాటుకుందాం. చాలా జొన్నలు వస్తాయి. అప్పుడు తిందాం" అంది కోడి.
 కోతికి కోపం వచ్చింది.   "బలే చెప్పేవులే. ఎప్పుడో వచ్చే గింజల కోసం ఇప్పుడు కడుపు మాడ్చుకుంటామా? అప్పటికి  రాజవడో, రెడ్డేవడో? రా తిందాం" అంది కోతి. "సరే మిత్రమా నీ భాగం నీవు తిను. నా భాగం నాకివ్వు" అంది కోడి. కోతి  చెరిసమంగా పంచింది. తన భాగం  మచ్చటంగా తిన్నది.  కోడి భాగం కోడికి ఇచ్చింది.
    కోడి వాటిని ఇంటికి తీసుకు వెళ్ళింది.  పొలంలో నాటింది. మొక్కలు మొలిచాయి. వాటికి ప్రతిరోజు నీళ్లు పోసింది. కొన్నాళ్లకు కంకులు వచ్చాయి. వాటిని కోసి దాచిపెట్టుకుంది. ప్రతి రోజు  వాటిని తింటూ హాయిగా వుండసాగింది. కోతి మాత్రం  దొరికితే తింటూ, లేకుంటే పస్తులుంటు కాలం గడపసాగింది. 'కోడి చెప్పినట్టు విని ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు ఉండేవి కాదు కదా' అని కోతి బాధ పడుతూ ఉంది.  'నేడు కష్టపడితే రేపు సుఖం' అంటే ఇదే.