సంగీతరావు జ్ఞాపకాలు !: -- యామిజాల జగదీశ్

 పట్రాయని సంగీతరావుగారు చెన్నైలో  తుదిశ్వాస విడిచారన్న సమాచారం క్లాస్ మేట్ శివప్రసాద్ ద్వారా తెలిసింది. ఆయన వయస్సు నూట రెండేళ్ళు. 
పత్రికల్లో శతాధిక వృద్ధులంటూ అప్పుడప్పుడూ వార్తలు రాయడం, చదవడం సరేసరి. కానీ శతవసంతాలు పూర్తి చేసుకున్న ముగ్గురిని ప్రత్యక్షంగా చూసాను. ఈ ముగ్గురిలో ఒకరు మా సైన్స్ మాస్టారు శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రిగారు. మరొకరు పట్రాయని సంగీతరావుగారు. ఇక మూడో వ్యక్తి నా చిన్ననాటి మిత్రుడైన జర్నలిస్ట్ జొన్నలగడ్డ నరసింహారావుగారి అమ్మగారు. ఆమె క్షేమసమాచారాన్ని ఈమధ్యే నరసింహారావు తెలియజేశారుకూడా. 
సంగీతరావు గారు హార్మోనియం వాయించడం చూశాను. కీ.శే. ఘంటసాల మాస్టారుగారి ఆవరణలోనే సంగీతరావుగారి కుటుంబం  (మద్రాస్ టీ.నగర్లోని ఉస్మాన్ రోడ్డలో) ఉండేది. ఘంటసాలగారికి సంగీతరావుగారి తండ్రిగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారు గురువుగారు. 
 ఆయన సన్నిహితంగా తెలిసినవారే. ఘంటసాల గారి దగ్గరే హార్మోనిస్టుగా ఉండిన సంగీతరావుగారు తర్వాతి రోజుల్లో వెంంపటి చినసత్యంగారి డ్యాన్స్ అకాడమీలో నృత్యరూపకాలకు సంగీతం సమకూర్చారు.
సంగీతరావు గారు మా ఇంటికి తరచూ వచ్చేవారు మా నాన్నగారికోసం. సంగీతం గురించి చర్చించుకునే వారు. వీరి మధ్య మాటలు జరుగుతున్నప్పుడు పక్కనే కూర్చుని వినేవాడిని.   
ఆంధ్రప్రభలో కొన్ని వ్యాసాలు, కథలు కూడా రాసిన సంగీతరావుగారు హరికథాపితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగారి ప్రతిభ గురించి రాసిన వ్యాసం ఎంతగానో ఆకట్టుకుంది నన్ను.
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలంగారి అల్లుడు వజీర్ రహ్మాన్ గారికి సంగీతరావుగారంటే చాలా అభిమానం. వీరి మధ్యకూడా సంగీతం గురించి చర్చలు జరుగుతుండటం నేను ప్రత్యక్షంగా కన్నాను.
సంగీతరావుగారి పెద్దమ్మాయి కె.వి. రమణమ్మగారు మా నాన్నగారి శిష్యురాలు. ఈవిడ కోడంబాక్కంలోని మీనాక్షి మహిళా కాలేజీలో తెలుగు శాఖకు అధిపతిగా పని చేసి పదవీ విరమణ పొందారు. 
సంగీతరావుగారి కుమారులలో గోపాలకృష్ణతో నాకు మంచి పరిచయమే ఉంది.
సంగీతరావు గారు ఎంతో సౌమ్యులు. ఆయన మాటతీరు మృదుమధురంగా ఉండేది. ఆ గాత్రమాధుర్యం వింటున్నట్టే ఉంటుంది ఆయన పేరును స్మరిస్తున్నప్పుడల్లా.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 
వారి కుటుంబసభ్యులకే కాక సంగీతానికి తీరని లోటు. 
సంగీతాన్నే తన పేరుగా చేసుకుని సంగీతసామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న సంగీతరావుగారి స్మృత్యర్థం ఈ నాలుగు మాటలు.